సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ పై కీలక ప్రకటన : కొత్తగా మరో రైలు సిద్దం..!!
సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ నెలన్నార సమయంలోనే కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. అంచనాలను మించి స్పందన కనిపిస్తోంది. సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ నెలన్నార సమయంలోనే ఈ రికార్డును క్రియేట్ చేసింది. దేశ వ్యాప్తంగా నడుస్తున్న వందేభారత్ రైళ్లల్లో ఆక్యుపెన్సీకి సంబంధించి వివరాలను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న వందేభారత్ వంద శాతం ఆక్యుపెన్సీ దాటింది. తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఆదరణో రైల్వే మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కొత్తగా వందేభారత్ సర్వీసు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు చేసారు. ఏప్రిల్ లో తెలుగు రాష్ట్రాల నుంచి మరో రెండు వందేభారత్ సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

అంచనాలకు మించిన ఆదరణ
జవనరిలో సంక్రాంతి రోజున ప్రధాని మోదీ సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ ను ప్రారంభించారు. ఈ రైలుకు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి స్పందన వస్తుందో అనే సందేహాలు రైల్వే అధికారులు వ్యక్తం అయ్యాయి. వందేభారత్ లో టికెట్ ధరల పైన విమర్శలు వినిపించాయి. కానీ, ప్రయాణీకుల నుంచి ఆదరణ అంచనాలకు మించి కనిపించింది. రైల్వే శాఖ విడుదల చేసిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జనవరి లో ప్రారంభమైన ఈ రైలు 125.76 % ఆక్యుపెన్సీ సాధించింది. న్యూఢిల్లీ - వారణాశి మధ్య నడుస్తున్న వందేభారత్ తో పోటీ పడి సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్న రైలుకు ఈ స్థాయిలో స్పందన వచ్చింది. రైల్వే శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మొత్తం ఎనిమిది వందే భారత్ రైళ్లల్లో అయిదు రైళ్లు దాదాపుగా వంద శాతం ఆక్యెపెన్సీతో కొనసాగుతున్నాయి. నిత్యం ఈ రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య..వెయిటింగ్ లిస్టు ఆధారంగా ఈ గణాంకాలను ప్రకటించారు.
రైల్వే శాఖ వివరాలు వెల్లడి
రైలు ప్రారంభించిన రోజు నుంచి నెల రోజు పాటు వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తం 29 ట్రిప్పుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 44939 మంది ప్రయాణం చేసినట్లు తేల్చారు. సికింద్రాబాద్ - విశాఖ రూట్లో సగటున ఒక్కో ట్రిప్ లో 1623 మంది ప్రయాణించారు. కాగా, విశాఖ - సికింద్రాబాద్ మధ్య ఒక రోజులో సగటున 1500 మంది ప్రయాణం చేసారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే సమయంలో విజయవాడ లో ఎక్కువగా ప్రయాణీకులు ఈ రైలు ఎక్కేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుర్తించారు. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి విశాఖ వచ్చే సమయంలో ప్రయాణీకుల సంఖ్య..విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. ఈ రైలులో వరంగల్ - ఖమ్మం స్టేషన్లలో ఆదరణ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విశాఖ- సికింద్రాబాద్ ప్రయాణీకుల ఆదరణపై అధికారులు అభిప్రాయ సేకరణ చేయగా.. ప్రయాణ సమయం తక్కువగా ఉండటంతో తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎక్కవ మంది చెప్పుకొచ్చారు.

ఈ నెలలోనే మరో రైలు ప్రారంభం
ఇక..ఈ నెలలోనే సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నల్గొండ - నడకూడి- గుంటూరు మీదుగా నడుస్తున్న నారాయణాద్రి రూటులోనే వందేభారత్ నడిచేలా నిర్ణయించారు. కానీ, శావల్యాపురం - ఒంగోలు రూటు మీదుగా మళ్లించే ఆలోచన పైనా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ట్రియల్ రన్ కూడా పూర్తి చేసారు. టికెట్ ధరలు..రైలు నెంబర్.. ప్రయాణం వేళలు ప్రకటన దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ కొత్త సర్వీసు ప్రారంభం పైన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సికింద్రాబాద్ - తిరుపతి 12 గంటల వరకు ప్రయాణ సమయం పడుతోంది. వందేభారత్ అందుబాటులోకి వస్తే రెండు గంటల వరకు సమయం ఆదా అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వారంలోనే ఈ రైలుకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications