సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ కొత్త రికార్డు : రైల్వే శాఖ తాజా నిర్ణయం..!!
వందేభారత్ కు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఆదరణతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. సంక్రాంతి రోజున ప్రధాని మోదీ విశాఖ - సికింద్రాబాద్ వందేభారత్ ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ రైలు కొత్త రికార్డు క్రియేట్ చేసింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు పది వందేభారత్ రైళ్లను రైల్వే శాఖ ప్రారంభించింది. అందులో జనవరి నెలాఖరు వరకు ప్రారంభమైన ఎనిమిది వందేభారత్ రైళ్లకు లభిస్తున్న ఆదరణ వివరాలను రైల్వే శాఖ ప్రకటించింది. మూడు రైళ్లు మినహా మిగిలిన అయిదుకు ఆశించిన దాని కంటే ఎక్కువగా ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నట్లుగా స్పష్టం అయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఆదరణతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ కు వస్తున్న ఆదరణతో ఈ నిర్ణయం వేగంగా అమలు చేయాలని భావిస్తోంది.
సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ కు అనూహ్య స్పందన కనిపిస్తోంది. జనవరి లో ప్రారంభమైన ఈ రైలు 125.76 % ఆక్యుపెన్సీ సాధించింది. న్యూఢిల్లీ - వారణాశి మధ్య నడుస్తున్న వందేభారత్ తో పోటీ పడి సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్న రైలుకు ఈ స్థాయిలో స్పందన వచ్చింది. రైల్వే శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మొత్తం ఎనిమిది వందే భారత్ రైళ్లల్లో అయిదు రైళ్లు దాదాపుగా వంద శాతం ఆక్యెపెన్సీతో కొనసాగుతున్నాయి. నిత్యం ఈ రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య..వెయిటింగ్ లిస్టు ఆధారంగా ఈ గణాంకాలను ప్రకటించారు. ముంబాయి - గాంధీనగర్ వందేభారత్ రికార్డు స్థాయి ఆక్యెపెన్సీతో నడుస్తోంది.

ఇక..తెలుగు రాష్ట్రాల్లో నడస్తున్న ప్రస్తుత సర్వీసుకు ఆదరణ తో రైల్వే శాఖ వచ్చే నెలలో మరో సర్వీసు ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో భాగంగా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ సర్వీసు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఇప్పటికే ట్రయిల్ రన్ కూడా పూర్తి చేసారు. ఇందుకు సంబంధించి రూట్ కూడా ఖరారు చేసారు. ప్రస్తుతం సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నల్గొండ - నడకూడి- గుంటూరు మీదుగా నడుస్తున్న నారాయణాద్రి రూటులోనే వందేభారత్ నడిచేలా నిర్ణయించారు. త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పష్టత ఇచ్చారు. ఇప్పటి వరకు వందేభారత్ 1635 ట్రిప్పులతో దాదాపు 20 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చాయి.












Click it and Unblock the Notifications