70మంది వెళ్తారన్నా కానీ, ప్రణబ్ హామీ: టిపై లగడపాటి
హైదరాబాద్: దాదాపు 70మంది దాకా కాంగ్రెసు పార్టీని వీడుతారనే తాను చెప్పాను కానీ ఏ పార్టీలోకి వెళ్తారో చెప్పలేదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ ఆదివారం అన్నారు. కాంగ్రెసు పార్టీని వీడే వారు ఏ పార్టీలోకి వెళ్తారో, రాజకీయాల్లో ఉంటారో ఉండరో తెలియదన్నారు. తెలంగాణ విషయంలో రాజ్యాంగం ప్రకారం ముందుకు వెళ్తానని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమకు మాటిచ్చారన్నారు.
సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివ రావు, హర్ష కుమార్ తదితరులు రాష్ట్రపతిని కలిశారు. అనంతరం లగడపాటి విలేకరులతో మాట్లాడారు. తాము కేంద్రంపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చినా చర్చకు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు.

పార్టీలో నుండి బయటకు వెళ్లే వారు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అంచనా ప్రకారం 30 మంది అయితే తన అంచనా ప్రకారం 70 వరకు ఉందన్నారు. రాష్ట్ర మంత్రులే కాకుండా కేంద్రమంత్రులు కూడా ఆ లిస్టులో ఉన్నారన్నారు. రాజకీయ అవసరాల కోసమే విభజన చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రపతిని కలిస్తే రాజ్యాంగం ప్రకారం వెళ్తానని ఆయన నుండి తమకు హామీ లభించిందన్నారు. అసెంబ్లీలో కూడా తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరగాలన్నారు. మైనార్టీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా తెలంగాణ బిల్లు తీసుకు వస్తోందని ధ్వజమెత్తారు. నాలుగు నెలల క్రితమే తాము సభాపతికి రాజీనామా ఇచ్చామన్నారు.
కాగా, వారు రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చారు. అందులో కేంద్రం మైనార్టీలో ఉందని, అయినా బిల్లును తెస్తోందని పేర్కొన్నారు. తమ అవిశ్వాసానికి 70మంది ఎంపీల మద్దతున్నా పార్లమెంటు వాయిదా వేసారని, తృణమూల్, డిఎంకె, మజ్లిస్ ఇప్పటికే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయని వారు తెలిపారు. అనంతరం ఎంపీలు లగడపాటి, హర్ష కుమార్‌లు క్యాంపాఫీసులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు.












Click it and Unblock the Notifications