చంద్రబాబు నియామకం: అలా తేలితే శేఖర్ రెడ్డిని తొలగిస్తామని మంత్రి
వంద కోట్ల రూపాయలకు పైగా ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అది నల్లధనమని తేలితే శేఖర్ రెడ్డిని టిటిడి పదవి నుంచి తొలగిస్తామని మంత్రి మాణిక్యాలరావు చెబుతున్నారు.
ద్వారకాతిరుమల, డిసెంబర్ 9: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి వద్ద ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు నల్ల ధనమేనని రుజువైతే ఆయనను పదవి నుండి తొలగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు.
శేఖర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు. టిటిడి పాలక మండలి సభ్యుడిగా నియమించే సమయంలో శేఖర్ రెడ్డిపై ఏ విధమైన కేసులు కూడా లేవని ఆయన స్పష్టం చేశారు. శేఖర్ రెడ్డి, ఇతర వ్యాపారుల నివాసాల్లో ఐటి అధికారులు నిర్వహించిన సోదాల్లో వంద కోట్లకు పైగా డబ్బు, 127 కిలోల బంగారం పట్టుపడిన విషయం తెలిసిందే.
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని చిన వెంకన్నను శుక్రవారం మంత్రి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనాన్ని పలికారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు ఆయనకు చిన వెంకన్న చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని అందించారు. అనంతరం మంత్రి విలేఖర్లతో మాట్లాడారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమేనని అన్నారు. అయితే ప్రజలంతా నల్లధన నిర్మూలనను స్వాగతిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో మోడీ పాలనను ప్రజలు కోరుకుంటున్నట్టు మంత్రి మాణిక్యాలరావు చెప్పారు.












Click it and Unblock the Notifications