మా బాబుగారి హయాంలో కట్టినవి..ఇవిగో
విశాఖపట్నం: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా సెల్ఫీ ఛాలెంజ్ నడుస్తోంది. తన యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఈ ట్విట్టర్ వార్‌కు తెర తీశారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, తీసుకొచ్చిన కంపెనీల ముందు నిల్చుని ఆయన సెల్ఫీలు తీసుకుని వాటిని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ వస్తోన్నారు.
అలాగే- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఆయన ఇదే తరహాలో తెర మీదికి తీసుకొస్తోన్నారు. ఇది కాస్త పీక్స్‌కు చేరుకుంటోంది. పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.. ఉద్ధానంలో ప్రభుత్వం నిర్మిస్తోన్న 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ భవనం వద్ద వైఎస్ జగన్ మాస్క్ ధరించి మరీ సెల్ఫీ దిగారు.

ప్రస్తుతం ఈ భవనం నిర్మాణం తుది దశకు చేరుకుందని, చంద్రబాబు హయాంలో ఇలాంటివి ఒక్కటైనా నిర్మించారా? అంటూ సవాల్ విసిరారు. ఇలాంటివి నిర్మించాలన్న కనీస ఆలోచనైనా చంద్రబాబుకు వచ్చిందా అంటూ నిలదీశారు. ఏపీ కేబినెట్ మంత్రి హోదాలో తాను చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తోన్నానని, అలాగే- ఈ సవాల్‌ను కూడా స్వీకరించాలని డిమాండ్ చేశారు. చేతనైతే ఈ సారైనా నిజాయితీగా వ్యవహరించాలని సూచించారు.

దీనిపై తెలుగుదేశం పార్టీకే చెందిన విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ స్పందించారు. విశాఖపట్నంలో తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కొన్ని భవనాల ముందు నిల్చుని సెల్ఫీ దిగారు. వాటిని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించామని గుర్తు చేశారు.
ఆంధ్రా యూనివర్శిటీ కన్వెన్షన్ సెంటర్, చిల్డ్రన్స్ ఎరీనా, టీయూ 142 విమాన మ్యూజియంలను తాము చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించామని గంటా శ్రీనివాస్ చెప్పుకొన్నారు. ఇంకా మరెన్నో ఇలాంటి సజీవ సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. ఈ నాలుగు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో కట్టిన ఒక చిన్న రేకుల షెడ్ అయినా చూపించగలరా? అంటూ ఆయన వైఎస్ జగన్‌కు ఛాలెంజ్ చేశారు.

దీనిపై వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు సోషల్ మీడియా వేదికగా గంటా శ్రీనివాస్‌ను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోన్నారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించినవి ఇవేనా? అంటూ ఎదురు దాడి మొదలు పెట్టారు. వైఎస్ జగన్ తన నాలుగేళ్ల కాలంలోనే కిడ్నీ సమస్యను తరిమి కొట్టడానికి ఏకంగా రీసెర్చ్ సెంటర్, 200 పడకల సామర్థ్యంతో ఆసుపత్రిని కడుతున్నారని గుర్తు చేశారు.
పేదలకు పనికి వచ్చే ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ? ఇవి ఎక్కడ? అంటూ పోలీక తీసుకొచ్చారు. జగన్ ప్రభుత్వం హయాంలో ఈ నాలుగేళ్లల్లో విశాఖలో 150 కోట్ల రూపాయలతో ఎన్ఏడీ ఫ్లైఓవర్, 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సీ హ్యారియర్, 33 కోట్ల రూపాయలతో వుడా పార్క్ అభివృద్ధి, సిరిపురం వద్ద 80 కోట్లతో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణంలో ఉందని గుర్తు చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications