నకిలీ సర్టిఫికెట్ల విక్రయం: బెంగళూరులో ఆంధ్ర యువకుల అరెస్టు
బెంగళూరు: నకిలీ దృవీకరణ పత్రాలు తయారు చేసి విక్రయించి నిరుద్యోగులను మోసం చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్న నిందితులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి వివిధ కంపెనీల పేరుతో తయారు చేసిన నకిలి లెటర్ హెడ్ లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మైసూరా రెడ్డి (25), మణిదీప్ (19) అనే ఇద్దరిని అరెస్టు చేశామని సీసీబీ పోలీసులు చెప్పారు. నిందితుల నుండి 18 ల్యాండ్ లైన్ ఫోన్ లు, రెండు మొబైల్ ఫోన్ లు, స్కానర్, ప్రింటర్, వివిధ కంపెనీలకు చెందిన నకిలి ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
మైసూరా రెడ్డి తన స్నేహితుడి పేరుతో బెంగళూరులో గల హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని శ్రీ హనుమాన్ వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్కడే ల్యాండ్ లైన్ ఫోన్ లు పెట్టి నకిలి సర్టిఫికెట్ల వ్యాపారం మొదలు పెట్టాడు.

ఇంటర్నెట్ లో ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటనలు ఇచ్చాడు. నిరుద్యోగులను సంప్రదించారు. తరువాత ఒక కంపెనీలో రెండు సంవత్సరాలు పని చేసినట్లు, రిలీవింగ్ లెటర్, స్యాలరీ సర్టిఫికెట్ తో పాటు ఉద్యోగానికి అవసరం అయిన సర్టిఫికెట్లు ఇస్తామని నమ్మించారు.
తరువాత ఒక్కొక్కరి దగ్గర రూ. 15 వేల నుండి రూ. 25 వేలు వసూలు చేసి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చాడు. బీటెక్ పూర్తిచేసిన ఆంధ్ర యువతి వీరి దగ్గర నకిలి సర్టిఫికెట్లు తీసుకుని మోసపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేశారు.
బీటెక్ పూర్తి చేసిన మైసూరా రెడ్డి ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చాడు. తరువాత నకిలి సర్టిఫికెట్లు విక్రయాల వ్యాపారం మొదలు పెట్టాడు. ఇతను ఇప్పటి వరకు 840 మందికి నకిలి సర్టిఫికెట్లు ఇచ్చాడని కోట్ల రూపాయలు సంపాదించాడని సీసీబీ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.












Click it and Unblock the Notifications