వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్- మద్యం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం..!
వైసీపీ ఎంపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన పీవీ మిథున్ రెడ్డికి ఇవాళ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుున్న ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనకు ఊరటనిచ్చేందుకు నిరాకరించింది. దీంతో మిథున్ రెడ్డి పిటిషన్ ను తోసిపుచ్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని భావిస్తున్న 4 వేల కోట్ల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డితో పాటు పలువురిని ఇప్పటికే సీఐడీ సిట్ నిందితులుగా చేర్చింది. అలాగే రాజ్ కెసిరెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో పాటు మరికొందరిని అరెస్టులు కూడా చేసింది. ఈ నేపథ్యంలో తనను కూడా అరెస్టు చేస్తారనే భయంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

వైసీపీ ప్రభుత్వం రాక ముందు మద్యం సరఫరా, ఆర్డర్లు అన్నీ ఆన్ లైన్ విధానంలో ఉండేవని, కానీ వైసీపీ వచ్చాక దీన్ని మ్యాన్యువల్ విధానంలోకి మార్చడంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని సీఐడీ ఆరోపిస్తోంది. మ్యాన్యువల్ విధానంలో తమకు ముడుపులు ఇచ్చిన కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారని ఆరోపించింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు 3500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కోర్టుకు తెలిపింది. ఈ స్కాంకు మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అని తెలిపింది. ఇప్పటికే విచారణకు ఆయన సహకరించడం లేదని అధికారులు కోర్టుకు తెలిపారు. మిథున్ రెడ్డికి నేరచరిత్ర కూడా ఉందని, ఆయనపై ఇప్పటికే 8 కేసులు కూడా ఉన్నట్లు హైకోర్టుకు తెలిపారు.
అయితే మిథున్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన లాయర్ నిరంజన్ రెడ్డి ఈ వాదనలు తోసిపుచ్చారు. మిథున్ రెడ్డికి ఈ స్కాంతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ప్రభుత్వ మద్యం విధానంలో మిథున్ రెడ్డి పాత్ర లేదన్నారు. దీంతో కనీసం షరతులతో అయినా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ హైకోర్టు మాత్రం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చేసింది.












Click it and Unblock the Notifications