వైకాపాకి శెట్టిబలిజల ఝలక్...పార్టీ కార్యకలాపాలకు దూరం అంటూ ప్రకటన

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

తూర్పుగోదావరి: వైసిపికి శెట్టిబలిజలు ఊహించనివిధంగా గట్టి షాక్‌ ఇచ్చారు. వైఎస్ఆర్సిపి ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తమను అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని...అందుకే ఇక పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తీర్మానించుకున్నట్లు ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి స్వగృహంలో ఆయన నేతృత్వంలో సమావేశమైన వివిధ నియోజకవర్గాలకు చెందిన శెట్టిబలిజ సామాజికవర్గ పెద్దలు ఈ మేరకు తీర్మానం చేసి ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్యఅతిథిగా హాజరుకావడం సంచలనం సృష్టిస్తోంది.

 Settibalija caste group Shock to YSRCP in East Godavari

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కుడుపూడి చిట్టబ్బాయి స్వగృహంలో జరిగిన శెట్టిజలిజల సమావేశంలో వైసిపి అధినేత జగన్‌ వైఖరిని నిరసిస్తూ శెట్టిబలిజ పెద్దలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ టికెట్‌ను ప్రస్తుత సమన్వయకర్త పితాని బాలకృష్ణకు గానీ, లేదంటే విజయావకాశాలున్న మరే శెట్టిబలిజ నాయకుడికైనా ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. తమని కనీసం అడగకుండా ముమ్మడివరం ఎమ్మెల్యే సీటు మీదేనని మత్స్యకార వర్గానికి చెందిన పొన్నాడ సతీశ్‌కుమార్‌కు జగన్‌ భరోసా ఇవ్వడాన్ని వీరు తప్పుబట్టారు.

శెట్టిబలిజల సమావేశం సందర్భంగా తీసుకున్న కీలక నిర్ణయాలను వైసీపీ అధి నాయకత్వానికి నివేదించే బాధ్యతను ఎమ్మెల్సీ బోస్‌, చిట్టబ్బాయిలకు అప్పగించారు. అనంతరం శెట్టిబలిజ నేతలతో కలిసి ఎమ్మెల్సీ బోస్‌, చిట్టబ్బాయి మీడియాతో మాట్లాడారు. "మాకు కులమే ప్రధానం...వారి మద్దతుతోనే ఈ స్థాయిలో ఉన్నాం. వారి నిర్ణయమే మాకు శిరోధార్యం.. మా సామాజికవర్గం కోసం దేనికైనా సిద్ధం.

పార్టీ అధినేత జగన్‌ను కలిసి.. కాకినాడ టికెట్‌ను మత్స్యకారులకిచ్చి ముమ్మిడివరం టికెట్‌ను శెట్టిబలిజ వర్గానికి కేటాయించాలని కోరాం. కానీ ఆయన నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో ఇక నుంచి వైసీపీ కార్యకలాపాలకు శెట్టిబలిజలంతా దూరంగా ఉండాలని నిర్ణయించాం"... అని ప్రకటించారు.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా దళితులు, ఆ తర్వాత స్థానంలో శెట్టిబలిజలు, కాపులు ఉన్నారని ఈ సందర్భంగా బోస్‌ చెప్పారు. శెట్టిబలిజల నుంచి గతంలో ముగ్గురు ఎమ్మెల్యేలుగా, జడ్పీ చైర్మన్‌, కాకినాడ మేయర్‌గా పదవులు నిర్వహించారని, బలమైన తమ సామాజిక వర్గాన్ని దూరంగా ఉంచుతున్నందుకు వైసీపీపై తమ పెద్దలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. అధిష్ఠానం దిగిరాకపోతే త్వరలో ముమ్మిడివరంలో జిల్లాస్థాయి తమ కుల సమావేశాన్ని ఏర్పాటుచేసి అక్కడ కీలక నిర్ణయాలు తీసుకుంటామని శెట్టి బలిజ నాయకులు హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
East Godavari: The SettIbalija caste gave a shock to the YCP in East Godavari District.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి