ఏపీలో నేటి నుంచి మరింత తీవ్ర వడగాల్పులు- 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు
ఏపీలో ఇవాళ్టి నుంచి వేసవి తాపం మరింత తీవ్రం కానుంది. ఇప్పటికే వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణశాఖ మరింత చేదు కబురు చెప్పింది. ఇవాళ్టి నుంచి కోస్తా జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత పెరగడం ఖాయమని తెలిపింది. దీంతో జనం ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్ధితి.
కోస్తాలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు అమాంతం పెరగనున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.ఈ శనివారం నుంచి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదు కావడంతోపాటు ఐదారు రోజులపాటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు. మయన్మార్‌కు ఆనుకుని గల్ఫ్ ఆఫ్ మార్టాబన్ పరిసరాల్లో నిన్న అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ ఇది మరింత బలపడి ఈశాన్యంగా మయన్మార్ తీరం దిశగా పయనించనుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షణ, మధ్య భారతం మీదుగా గాలులు అల్పపీడనం దిశగా వెళ్లనున్నట్టు చెప్పారు.

మయన్మార్ తీరం వెంబడి పయనించే అల్పపీడనం కారణంగా రేపటి నుంచి ఏపీ మీదుగా పడమర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. మయన్మార్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం వల్ల నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలంగా మారిందన్నారు. అలాగే, ఈ నెల 27 లేదంటే 28 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని, ఈ నెలాఖరు నాటికి లేదంటే జూన్ 1న రాయలసీమలో ప్రవేశిస్తాయని తెలిపారు. ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయిని అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications