ఏపీలో శాప్ ఉద్యోగులపై లైంగిక వేధింపులు-విచారణకు మహిళా కమిషన్ ఆదేశం
ఏపీలో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్ధ శాప్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై వారి పై ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మీడియాలోనూ ఇవాళ కథనాలు వచ్చాయి. దీనిపై మహిళా కమిషన్ స్పందించింది. తక్షణం విచారణకు ఆదేశిస్తున్నట్లు ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.
శాప్ లో మహిళ ఉద్యోగుల లైంగిక వేధింపులపై స్పందించిన రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. మహిళా కమీషన్ భాగస్వామ్యంతో విచారణ చేయాలని క్రీడాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. గత కొంతకాలంగా శాప్ కార్యాలయంలో మహిళ ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పద్మ ఓ ప్రకటనలో తెలిపారు. కానీ ఎక్కడ రాతపూర్వకంగా ఫిర్యాదు రాలేదన్నారు. దీంతో మీడియా ద్వారా వచ్చిన కథనాలను కమీషన్ సుమోటోగా స్వీకరించిందని ఆమె వెల్లడించారు.

శాప్ లో మహిళా ఉద్యోగులపై వేధింపుల విషయంలో నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. విచారణను రెండు రోజులలో పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగిణులు ఎవరైనా వేధింపులకు గురైతే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. మరోవైపు శాప్ లో వేధింపుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్ ఇప్పటికే వివరాలు తెప్పించుకుంటోంది. క్రీడాశాఖ విచారణ తర్వాత నిజమని తేలితే నోటీసులు జారీ చేసి సదరు ఉద్యోగులపై చర్యలకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications