రాహుల్ వచ్చి ఏం చేస్తారంటారా?: బాబుపై శైలజా
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విశాఖకు వచ్చి ఏం చేస్తారన్న చంద్రబాబు వ్యాఖ్యలు సిఎం స్థాయికి సరికావని అన్నారు.
కష్టాల్లో ఉన్నవారిని పరామర్శించడం పార్టీ నేతల బాధ్యత అని శైలజానాథ్ చెప్పారు. గతంలో చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పెను తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
హైదరాబాద్‌లో పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారే తప్ప, తుఫాను ముందస్తు జాగ్రత్తలపై చంద్రబాబు దృష్టి పెట్టలేదని ఆరోపించారు. అందుకే తీవ్ర నష్టం వాటిల్లందని చెప్పారు. ఒడిశా ప్రభుత్వం మాదిరిగా చంద్రబాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారో లేదో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

తుఫాను నష్టాన్ని అరికట్టేందుకు ఆయన తీసుకున్న చర్యలేంటో చెప్పాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. తుఫాను అంశాన్ని కూడా చంద్రబాబునాయుడు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని శైలజానాథ్ ఆరోపించారు.
తోట చంద్రశేఖర్ విరాళం
హుధుద్ తుఫాను బాధితుల సహాయర్థం వైయస్సార్ ఫౌండేషన్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తోట చంద్రశేఖర్ రూ. 15లక్షల విరాళం ప్రకటించారు. తుఫాను బాధితుల సహాయార్థం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విరాళాలు అందజేయాలని పిలుపునివ్వడంతో ఆ పార్టీకి చెందిన నేతల స్పందించి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
తుఫాను బాధితుల సహాయార్థం వైయస్సార్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూప్ ఉమ్మడిగా ఏర్పాటు చేసిన నిధికి తొలి విరాళంగా జగన్ రూ. 50లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రెండు నెలల వేతనాన్ని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలరోజుల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications