సామాన్యులకు కూరగాయల ధరల షాక్.. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు!
తెలుగు రాష్ట్రాలలో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కూరగాయలను కొనుక్కోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏ కూరగాయ కొనాలన్నా ధర ఎక్కువగా ఉండడంతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అంటూ వాపోతున్నారు.
చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు
ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలు, ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి మొంథా తుఫాను కారణంగా కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయలు దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా నవంబర్ నెలలో కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయి కానీ ఈసారి మాత్రం కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి.

కూరగాయల ధరల పెరుగుదలకు కారణాలు ఇవే
డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు, రవాణా ఖర్చులు పెరగడం వంటి అనేక కారణాలు వినియోగదారుల పైన భారాన్ని పెంచుతున్నాయి. ప్రస్తుతం ఏ కూరగాయ తీసుకున్నా 80 రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలుకుతుంది. మొంథా తుఫానుకు ముందు కిలో టమాటా ధర 20 రూపాయల నుంచి 40 రూపాయలు ఉండగా ఇప్పుడు 60 రూపాయలకు చేరింది.
ప్రస్తుతం కూరగాయల ధరలిలా
ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కిలో 40 నుండి 50 రూపాయలకు పాలకూర, గోంగూర, మెంతుకూర వంటి వాటిని విక్రయిస్తున్నారు. బెండకాయలు 80 రూపాయలు, పచ్చిమిరపకాయలు 100 రూపాయలు, క్యారెట్ 100 రూపాయలు, బీట్రూట్ వంద రూపాయలు, వంకాయలు నూట పది రూపాయలు, బీరకాయలు 80 రూపాయలు ఇలా ప్రతి కూరగాయ ధర విపరీతంగా ఉంది.
కార్తీక మాసం కూడా కూరగాయల ధరల పెరుగుదలకు కారణం
కూరగాయలను కొనుగోలు చేయడానికి వెళ్ళిన వాళ్ళు 500 రూపాయలను ఖర్చు పెడితే కనీసం మూడు రోజులకు కూడా కూరగాయలు రాని పరిస్థితి ఉంది. ఇక కార్తీకమాసంలో చాలామంది నాన్ వెజ్ తినకుండా వెజిటేరియన్ భోజనం తినడం వల్ల కూడా కూరగాయల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఏం కొనేటట్టు లేదు తినేటట్టు లేదు.. వాపోతున్న సామాన్యులు
ఏది ఏమైనా, కారణాలు ఏవైనా సరే సామాన్య మధ్య తరగతి ప్రజలు కూరగాయల మార్కెట్ కు వెళ్లి పెరిగిన ధరలతో కూరగాయలు కొనలేక ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరలు ఉన్న కూరగాయలను కొనుగోలు చేసుకుని సరిపెట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications