నెల్లూరులో జగన్ కు షాక్; రాజీనామా చేసి టీడీపీలో చేరిన 40మంది వాలంటీర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అనేక నియోజకవర్గాలలో రాజకీయ నాయకుల పార్టీ ఫిరాయింపులు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో తాజాగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల అంశాన్ని పదేపదే తన ప్రసంగాలలో ప్రస్తావిస్తూ ఉండగా, తాజాగా వాలంటీర్లు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు.
టీడీపీలో చేరిన 40మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని విధంగా వాలంటీర్లు షాకిచ్చారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి సమక్షంలో వాలంటీర్లు టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి వారిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు పార్టీలోకి స్వాగతించారు.

చంద్రబాబుపై నమ్మకంతో వాలంటీర్లు టీడీపీలో చేరిక
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విడువలూరు మండలం లోని 40 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ తెలుగుదేశం పార్టీలో వారు చేరారని చంద్రబాబు పైన సంపూర్ణ విశ్వాసంతో వారు టీడీపీలో చేరారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు ఉద్యోగాలు వస్తాయన్నారు.
టీడీపీ హయాంలో వాలంటీర్లకు 10వేల జీతం
ప్రస్తుత వైసిపి ప్రభుత్వ హయాంలో ఐదు వేల రూపాయల జీతం ఇస్తే, టిడిపి హయాంలో పదివేల రూపాయల జీతం ఇస్తామని వెల్లడించారు. అంతేకాదు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని, ఈ కారణంగానే అక్కడ పనిచేస్తున్న చాలామంది మహిళా వాలంటీర్లు రాజీనామా చేసి టీడీపీలో చేరారు అన్నారు.
వాలంటీర్ల చేరికతో వైసీపీ ప్రభుత్వానికి షాక్
ఇదే సమయంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి దమ్ముంటే నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకొని ఓట్లు అడగాలని, వ్యక్తిగత విమర్శలు చేస్తూ కాదని విమర్శించారు. మొత్తం 40 మంది వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడంతో వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలినట్టు అయింది. ఏది ఏమైనా ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications