జగన్ కు బిగ్ షాక్.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రాజీనామా.. కీలక ప్రకటన!!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని మరో షాక్ తగిలింది. పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పిఠాపురం లోని తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేసినట్టు పెండెం దొరబాబు వెల్లడించారు.
జగన్ కు షాక్
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎన్డీఏ కుటుంబంతో కలిసి పనిచేస్తానని పెండం దొరబాబు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో కొనసాగుతున్న ఆయన రాజీనామా చేయడం జగన్ కు షాక్ అని చెప్పాలి. 2004లో బిజెపి అభ్యర్థిగా దొరబాబు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన 2014 ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేసి పెండెం దొరబాబు ఓటమిపాలయ్యారు.

వైసీపీలో అసంతృప్తితో ఉన్న పెండెం దొరబాబు
అనంతరం 2019లో మళ్లీ పిఠాపురం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2024లో పవన్ కళ్యాణ్ పైన వంగా గీతను బరిలో నిలిపిన వైయస్ జగన్ పెండెం దొరబాబు కు టికెట్ ఇవ్వలేదు. గత ఎన్నికలలో తనకు కాకుండా వంగా గీతకు టికెట్ ఇవ్వడంతో అసహనంలో ఉన్న పెండం దొరబాబు వంగా గీత పార్టీ కార్యాలయాన్ని తన సమీపంలోనే ఏర్పాటు చేయడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
వైసీపీకి రాజీనామా చేశానన్న పెండెం దొరబాబు
ఎన్నికలకు ముందే పార్టీని విడాలని భావించినప్పటికీ జగన్ ఆయనను బుజ్జగించడంతో మళ్లీ వైసీపీలోనే కొనసాగారు. ఎన్నికల్లో పార్టీ కోసం పెద్దగా పనిచేసిన దాఖలాలు కూడా లేవు. ఎన్నికల్లో అంటీ ముట్టనట్టుగా ఆయన వ్యవహరించారు. తాజాగా వైసిపిని వీడి వెళుతున్నట్టు పెండెం దొరబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత 25 సంవత్సరాల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో తనకు అనుబంధం ఉందని పేర్కొన్నారు.

జగన్ పార్టీపై కీలక ప్రకటన
పార్టీ కోసం పని చేయడం తప్ప వెన్నుపోటు రాజకీయాలు చేయడం తనకు తెలియవు అని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో తనకు ఎటువంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. పిఠాపురం అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో కలిసి పని చేస్తానని వెల్లడించారు. త్వరలో తాను ఏ పార్టీలో చేరుతాను అనేది వెల్లడిస్తానని పేర్కొన్న పెండెం దొరబాబు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications