జగన్ సర్కార్ నిర్ణయం డోంట్ కేర్ ; ప్రైవేట్ స్కూల్స్ ఫీ'జులుం' : మొత్తం ఫీజులు చెల్లిస్తేనే తరగతులకు ఎంట్రీ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చి పడింది. ఒకపక్క పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులతో పిల్లల్ని స్కూలుకి పంపించాలంటే భయపడుతున్న తల్లిదండ్రులకు మరో పక్కన ఫీజుల కోసం పాఠశాల యాజమాన్యాలు వేధింపులకు గురి చేయడం కూడా ఇబ్బందిగా మారుతోంది. అసలే కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా నష్టపోయిన తల్లిదండ్రుల నుండి ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ల యాజమాన్యాలు. జగన్ సర్కార్ ఫీజులను ఫిక్స్ చేసి తీసుకున్న నిర్ణయాన్ని డోంట్ కేర్ అంటున్నారు.

ఫీజులను ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్ .. ఆ జీవోలు జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్ కాంతారావు చైర్మన్ గా పలువురు విద్యారంగ నిపుణులతో పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఫీజులు ఎంత వసూలు చేయాలనే దానిని నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 53, 54 లను తీసుకువచ్చింది. ఇక ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు 2021 - 22, 2022 - 23, 2023 - 24 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఫీజులు ఇలా
జీవో లు 53, 54 ప్రకారం గ్రామపంచాయతీలో అయితే నర్సరీ నుండి ఐదో తరగతి వరకు 10,000, పట్టణాల్లో 11000, నగరాల్లో 12000 ఫీజులు వసూలు చేయొచ్చు. ఇక ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు గ్రామాలలో 12000, పట్టణాల్లో 15000, నగరాల్లో 18000 ఇవ్వాలని ఫీజులుగా నిర్ణయించారు. హాస్టల్ విద్యార్థులకైతే గ్రామ పంచాయతీలలో 18,000 పట్టణాల్లో 20,000 నగరాల్లో 24 వేల వరకు మాత్రమే ఫీజులను వసూలు చేయాలి. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఫీజుల విషయంలో విడుదల చేసిన జీవోలతో తల్లిదండ్రులు కాస్త రిలీఫ్ అయ్యారు.

ప్రభుత్వం ఫిక్స్ చేసిన ఫీజులపై కోర్టుకు వెళ్ళిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు
ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేటర్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలలో ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై కోర్టుకు కూడా వెళ్లాయి. వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా ఎలాంటి అధ్యయనం లేకుండా ఫీజులు ఖరారు చేశారని, ఏ విధంగానూ పాఠశాలలను ఈ ఫీజులతో నిర్వహించలేమని కోర్టు మెట్లెక్కిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం ఫిక్స్ చేసిన ఫీజుల విషయాన్ని పక్కనపెట్టి, పాత విధానం ప్రకారం ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై తెగ ఒత్తిడి తెస్తున్నాయి.

పాత విధానంలో ఫీజులు చెల్లించాలని బలవంతపు వసూళ్లు
ఎవరైనా ప్రభుత్వం ఫీజులు ఫిక్స్ చేసిందని, అవే చెల్లిస్తాం అని మాట్లాడితే, ఆ వ్యవహారం కోర్టులో ఉందని, కోర్టు నిర్ణయం తర్వాత, కోర్టు ఆదేశాల ప్రకారం తర్వాత నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకూ పాత విధానంలో ఫీజులు చెల్లించాల్సిందే అంటూ బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు. ఆఫ్ లైన్ పాఠశాలలు నడిపిస్తున్న క్రమంలో మొత్తం ఫీజులు చెల్లిస్తేనే పిల్లలను భౌతిక తరగతులకు అనుమతి ఇస్తామంటూ తేల్చి చెబుతున్నారు. ఫీజులు కట్టిన పిల్లలకు మాత్రమే భౌతిక తరగతులు నిర్వహిస్తామని, మిగిలిన వారిని రానివ్వమని స్కూల్స్ యాజమాన్యాలు తల్లిదండ్రులకు నిక్కచ్చిగా చెప్తున్న పరిస్థితి ఉంది.

ఈ విద్యా సంవత్సరం మొత్తానికి ఫీజులు చెల్లిస్తేనే తరగతులకు అనుమతి
గతేడాది నుండి ఇప్పటివరకు, భౌతిక తరగతుల నిర్వహణ జరగకపోవడంతో, ప్రైవేట్ పాఠశాలలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇక ప్రస్తుతం ఏపీ సర్కార్ స్కూల్స్ కొనసాగించాలని తీసుకున్న నిర్ణయంతో ఆ సంక్షోభం నుండి బయట పడడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల వద్ద నుండి బలవంతంగానైనా ఫీజులు వసూలు చేయాలని భావిస్తున్నాయి. ఆన్ లైన్ తరగతులు నిర్వహించిన క్రమంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఇప్పుడు స్కూల్స్ పునః ప్రారంభం కావడంతో గతేడాది నుండి ఇప్పటివరకు ఇవ్వని ఫీజుల మొండిబకాయిలు అన్నింటిని వసూలు చేసే పనిలో పడ్డాయి. అంతేకాదు ఈ విద్యా సంవత్సరం మొత్తానికి ఫీజు చెల్లిస్తేనే భౌతిక తరగతులకు అనుమతిస్తామని తేల్చి చెబుతున్నాయి దాదాపు అన్ని ప్రైవేటు పాఠశాలలు.

కరోనాతో మళ్ళీ స్కూల్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చినా నో ప్రాబ్లమ్ .. పక్కా ప్లాన్ గా
ఒకవేళ కరోనా మహమ్మారి కారణంగా మళ్లీ స్కూల్స్ మూతపడే పరిస్థితి వచ్చినా, తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే స్కూల్స్ కి రావాల్సిన ఫీజులు వసూలు కాకుంటే తాము పాఠశాలలను నిర్వహించలేమని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. మొత్తం ఫీజులు చెల్లించిన విద్యార్థులను మాత్రమే భౌతిక తరగతులకు అనుమతిస్తామని చెప్తున్నారు. తరగతులు నిర్వహించని సమయానికి కూడా ఫీజులు చెల్లించాలంటే మా వల్ల కాదని విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.

గతేడాది బకాయిలు, ఈ ఏడాది ఫీజు మొత్తం చెల్లిస్తేనే స్కూల్స్ కి పంపించాలని కఠిన నిర్ణయం
గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభించిన సమయం నుండి ఇప్పటి వరకు మాత్రమే కాదు, మొత్తంగా ఈ విద్యా సంవత్సరానికి కూడా ఫీజులు చెల్లించి విద్యార్థులను స్కూల్స్ కు పంపించడం తల్లిదండ్రులకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తుంది. మొత్తం ఫీజు చెల్లించాలి అంటే మా వల్ల కాదని స్కూల్స్ యాజమాన్యాలను ప్రాధేయ పడుతున్నా పట్టించుకోని పరిస్థితి దాదాపు చాలా స్కూళ్లలో ఉంది. ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఉండేలా చూడడానికి ఫీజులను ఖరారు చేసినా, విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
Recommended Video

లబోదిబో అంటున్న తల్లిదండ్రులు .. ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి
ఒకపక్క నిత్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని స్కూల్స్ లో పెరుగుతున్న కరోనా కేసులు, మరోపక్క ఫీజుల వసూళ్ల కోసం స్కూల్స్ యాజమాన్యాల వేధింపులు వెరసి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. అటు స్కూల్స్ కు పంపించలేక, స్కూల్స్ ప్రారంభమైన తర్వాత కూడా విద్యార్థులను చదువుకు దూరంగా ఇళ్లలోనే ఉంచుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితులపై దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలతో ఫీజుల విషయంలో చర్చలు జరిపి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications