TTD: భక్తులు సాయంత్రం పూజా సమయంలో క్షమా మంత్రాన్ని పఠించాలి
శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది.శాంతి హోమం నిర్వహించిన తరువాత ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు.
శ్రీవారి ఆలయంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం, నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను, అపోహలను పక్కన పెట్టవచ్చు అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.

అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మీడియాతో మాట్లాడారు.యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు తెలిపారు.పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు చెప్పారు.ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, శ్రీవారి భక్తులు సంతోషంగా లడ్డూ ప్రసాదాలను స్వీకరించవచ్చని తెలిపారు.
సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో, క్షమా మంత్రాలైన ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయ'' లను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరని టీటీడీ ఈవో శ్యామలరావు, తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకులు శ్రీవారి భక్తులకు మనవి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్ద జీయర్ స్వామి, తిరుమల శ్రీ చిన్న జీయర్ స్వామి తిరుమల శ్రీవారి ఆయం ప్రధానార్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, ఆగమ సలహాదారులు రామకృష్ణ దీక్షితులు, సీతారామ దీక్షితులు, వేదపారాయణదారులు, రుత్వికులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications