ఎస్సై సిద్దయ్య పరిస్ధితి విషమం, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య..!
హైదరాబాద్: దుండగులతో జరిగిన ఎదురుకాల్పుల్లో నాలుగు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోవడంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎస్సై సిద్దయ్య, భర్త పరిస్థితి విషమంగా ఉందని తెలిసి ఆసుపత్రి పాలైన ఆయన భార్య తొమ్మిది నెలల గర్భిణి. అదే ఆసుపత్రిలో సిద్ధయ్య భార్యకు రాత్రి 8 గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి.
మెటర్నిటీ వార్డులో ఆమెకు చికిత్స అందించారు. రాత్రి 10 గంటల సమయంలో సిద్ధయ్య భార్య ధరణీష మగబిడ్డకు జన్మనిచ్చింది. భార్య, భర్త, బాబు.. ఇప్పుడు ఒకే (ఎల్బీనగర్‌లోని కామినేని) ఆస్పత్రిలో ఉన్నారు.

ఎస్సై సిద్దయ్యకు ధరణీషతో ఏడాది కిందట వివాహమైంది. తర్వాత మూడు నెలలకు ఆమె గర్భం దాల్చారు. ఈ నెల 5న డెలివరీ అవుతుందని వైద్యులు తెలిపారు. కానీ, ఎన్‌కౌంటర్‌లో భర్త తీవ్రంగా గాయపడి భర్త పరిస్ధితి విషమంగా ఉందని తెలుసుకున్న భార్య ధరణీష ఆందోళనతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమెను వెంటనే ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకువచ్చారు.
కుటుంబసభ్యుల అనుమతితో ఆమెకు శస్త్రచికిత్స చేసి పురుడు పోశారు. ఇక దుండగులు దుండగులు జరిపిన కాల్పుల్లో ఎస్సై సిద్దయ్యకు మెదడు, తల, ఛాతీ, పొట్ట భాగాల్లో బుల్లెట్లు గుచ్చుకోగా వైద్యులు ఎనిమిది గంటల పాటు కొనసాగిన శస్త్రచికిత్సలో భాగంగా నాలుగింటిలో మూడు బుల్లెట్లను వైద్యులు తొలగించారు.

తలలో ఉన్న బుల్లెట్‌ను ఇంకా తొలగించలేదు. తలలో ఉన్న బుల్లెట్‌తో ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఎస్సై సిద్దయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున కామినేనికి వస్తున్నారు.
‘రక్తం బాగా పోతోంది. దానివల్ల చికిత్స కష్టం అవుతున్నది' అని చెప్పడంతో అప్పటికప్పుడు 15 మంది పోలీసులు రక్తమిచ్చి.. ఆయన్ను బతికించుకొనేందుకు సిద్ధమయ్యారు. సిద్దయ్య ప్రొబెషనరీ ఎస్‌ఐగా సర్వీసులోకి వచ్చి మూడేళ్లు అవుతుంది.
కడప జిల్లాకు చెందిన ఎస్సై సిద్దయ్య కుటుంబం కొన్నేళ్ల కిందటే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చి స్థిరపడింది. అతనికి ఇద్దరు అన్నలు. ఒకరు వ్యవసాయం చేస్తుండగా.. మరొకరు కర్నూలులో వ్యాపారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications