ఏపీ మద్యం స్కాంలో సిట్ రెండో ఛార్జిషీట్..! మళ్లీ బిగ్ బాస్ ప్రస్తావన..!
ఏపీ మద్యం స్కాంలో సిట్ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలు ఆధారాలు సేకరించిన సిట్ ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో రెండో అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన జగన్ మాజీ అధికారుల పాత్రపై ఆధారాలను ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. వీరిని అరెస్టు చేసి 90 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఆటో మేటిక్ గా బెయిల్ రాకుండా ఈ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే ఇందులోనూ మరోసారి బిగ్ బాస్ ప్రస్తావన చేసినట్లు సమాచారం.
మద్యం కుంభకోణంలో అరెస్టు అయి జైల్లో ఉన్న వైఎస్ జగన్ కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప పాత్రపై రెండో అభియోగపత్రంలోనూ సిట్ ఆధారాలను బయటపెట్టింది. బిగ్ బాస్ ఆదేశాల మేరకే మద్యం విధానం మార్పు, సిండికేట్ సమావేశాలు, ముడుపుల వ్యవహారం జరిగినట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అదే విషయాన్ని ఈ అదనపు ఛార్జిషీట్ లో ప్రస్తావించారు.

మద్యం విధానం మార్పు, అమలు, కమీషన్లు సహా ఇతర వ్యవహారాలను గత సీఎంఓ నుంచి ఆదేశాల సహా ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి పర్యవేక్షించారని సిట్ ఈ ఛార్జిషీట్ లో పేర్కొంది. అలాగే మద్యం ముడుపులను ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి, బ్లాక్ మనీని వైట్‌గా ఎలా మార్చాలనే అంశాలపై బాలాజీ గోవిందప్ప సూచనలు చేసినట్లు తెలిపింది. అలాగే ఈ ముగ్గురి కాల్ డేటా రికార్డు, గూగుల్ టేకౌట్ సహా ల్యాప్‌టాప్‌ల్లోని వివరాలను కూడా రెండో చార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది.

మద్యం విధానం రూపకల్పనలో జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ్ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారని సిట్ ఛార్జిషీట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మద్యం స్కాంలో ముడుపులు ఎవరి వద్ద నుంచి ఎంత తీసుకున్నారు, ఎవరెవరికి చేరింది అనే అంశంపై కూడా వివరాలను సేకరించినట్లు అధికారులు చెప్తున్నారు.. విజయ్ సాయిరెడ్డి, మిథున్ రెడ్డిలతో ఈ ముగ్గురు ఫోన్‌లో మాట్లాడిన వివరాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications