కల్తీ నెయ్యి కేసులో జగన్ బాబాయ్ ట్విస్ట్..! హైదరాబాద్ కు సిట్..!
ఏపీలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారుల బృందం దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లోని అనుభవం లేని డెయిరీలకు ఆర్డర్లు ఇవ్వడం, వారు పాలకు బదులు రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని టీటీడీకి పంపడం, దీన్ని వాడి లడ్డూ కల్తీ చేయడం జరిగిందని నిర్ధారణ అవుతోంది. దీంతో అప్పట్లో టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరించిన ప్రస్తుత వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాత్ర కీలకంగా మారింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయ్ కూడా అయిన వైవీ సుబ్బారెడ్డికి గతంలో పీఏగా వ్యవహరించిన చిన అప్పన్న కల్తీ నెయ్యి సరఫరా చేసిన డెయిరీల ప్రతినిధులతో చేసిన లావాదేవీలు బయటపడటంతో ఆయన్ను తాజాగా సిట్ అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి పాత్రను నిర్ధారించేందుకు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు పంపింది. అయితే తాను అనారోగ్యంగా ఉన్నట్లు వైవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిట్ రూటు మార్చింది.

అనారోగ్యంతో హైదరాబాద్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వైవీ సుబ్బారెడ్డిని అక్కడే విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 20న హైదరాబాద్ లోని ఇంటికే వస్తామని, విచారణకు సిద్దంగా ఉండాలని వైవీ సుబ్బారెడ్డికి సిట్ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి వైవీ సుబ్బారెడ్డి అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఈ నెల 20న జరిగే సిట్ విచారణలో వైవీ సుబ్బారెడ్డి చెప్పబోయే విషయాలు కల్తీ లడ్డూ కేసుకు కీలకంగా మారాయి.

సిట్ ఇప్పటికే కల్తీ నెయ్యిని వాడి తిరుమల లడ్డూలు తయారు చేసినట్లు నిర్ధారణకు వచ్చింది. అయితే మధ్యలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్బంగా పంపిన లడ్డూల తయారీకి మాత్రం నాణ్యమైన నెయ్యిని వాడినట్లు తేలింది. దీంతో ఈ రెండు నెయ్యిల మధ్య వ్యత్యాసం ఎందుకన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కల్తీ లడ్డూ కేసులో ఇప్పటికే రాష్ట్రంలో కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఈ కేసులో నిందితుడిగా తేలితే మాత్రం కూటమి వాదనకు మరింత బలం చేకూరనుంది. దీంతో ఈ నెల 20న సిట్ విచారణ కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications