'ప్రత్యేక హోదాపై బిజెపికి బాలకృష్ణ హెచ్చరిక, మిగతావాళ్లూ ఇలాగే రావాలి'
హైదరాబాద్: కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం తనకు ఉందని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయన్న సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పైన మాల మహానాడు నేత కారెం శివాజీ సోమవారం స్పందించారు.
బాలకృష్ణ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామన్నారు. అతనిలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక హోదా పైన గళం విప్పాలన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే బీజేపీ నేతలను గ్రామాల్లో తిరగనివ్వమని ప్రత్యేక హోదా సాధనా సమితి ఫోరం అధ్యక్షులు హెచ్చరించారు. నవంబర్ 2న తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే కావాలని, ప్యాకేజీ వద్దని అన్నారు. ప్రజలంతా ప్రత్యేక హోదా పైన ఏకమై పోరాడుతున్నారన్నారు. పార్లమెంటు పైన నమ్మకం ఉండాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాగా, ఆదివారం బాలకృష్ణ ప్రత్యేక హోదా అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి హెచ్చరికలు చేశారు. ఆదివారం ఉదయం కేన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతీసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా పైన ఏపీ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారన్నారు. కేంద్రం ఏపీకి ఆ హామీ నెరవేర్చుతుందనే నమ్మకం ఉందన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అబిప్రాయపడ్డారు. దశల వారీగా ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలన్నారు. హామీల్లో భాగంగానే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారన్నారు. పరిస్థితి చేయి దాటేంత వరకు కేంద్రం చూస్తూ ఊరుకోవద్దన్నారు.












Click it and Unblock the Notifications