వైఎస్ భాస్కర్ రెడ్డికి 6 రోజుల సీబీఐ కస్టడీ- మరో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికీ..
సంచలనం రేపుతున్న వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని ఆరు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. వివేకా కేసులో వీరి నుంచి అదనపు సమాచారం సేకరించేందుకు వీలుగా 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరినా కోర్టు మాత్రం ఆరు రోజుల పాటు అనుమతించింది.
వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ముందుగా గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ.. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. వీరిద్దరి రిమాండ్ రిపోర్టులో సీబీఐ పలు కీలక విషయాల్ని వెల్లడించింది. అయితే వీరిద్దరూ విచారణకు సహకరించడం లేదని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ కోర్టును వీరిద్దరినీ తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. దీనిపై ఇవాళ వాదనలు జరిగాయి.

వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ కస్డడీకి అప్పగించే విషయంలో ఇవాళ ఉదయం నుంచీ వాడివేడిగా వాదనలు జరిగాయి. అనంతరం వీరిద్దరిని ఆరు రోజుల కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు అంగీకరించింది. ఈనెల 19 నుంచి 24 తేదీ వరకు వీరిని కస్టడీలోకి తీసుకునందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీ విచారణలో భాగంగా ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications