నెల్లూరు జిల్లాలో హోటల్లోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోతిరెడ్డిపాలెం వద్ద రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మెడికల్ విద్యార్థులే..
ఈ ప్రమాదంలో మృతులంతా నారాయణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మృతి చెందినవారు నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలు. అలాగే ఘటన సమయంలో హోటల్‌లో ఉన్న రమణయ్య అనే వ్యక్తి కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి నవనీత్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అతివేగమే కారణమా..
ప్రమాదానికి ముందు విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. అయితే ప్రయాణించే కారు హఠాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌ను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications