జగన్ వాకౌట్: 'పార్టీ రద్దు చేసుకుంటే మంచిది',
హైదరాబాద్: ప్రజల చేత ఓట్లు వేయించుకుని అసెంబ్లీకి రాకుండా తన అవినీతి కోట అయిన లోటస్‌పాండ్‌లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ తన పార్టీ గుర్తింపును తానే స్వయంగా రద్దు చేసుకుంటే మంచిదని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
సోమవారం నెల్లూరు జిల్లా దగదర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకుండా ఉండటాన్ని సోమిరెడ్డి తప్పుబట్టారు. ప్రజా సమస్యల పరిష్కరానికి అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకోవడంలో ఆయన విఫలమయ్యారని అన్నారు. తన చేతకాని తనాన్ని అధికార పక్షంపై రుద్దేందుకు యత్నించడం మంచి పద్ధతి కాదన్నారు.
ఏపీ రాజకీయాల్లో ఎంతో సీనియర్ నేత అయిన స్పీక్ కోడెల శివప్రసాద్ పట్ల అమర్యాదగా మాట్లాడటం చూస్తుంటే, జగన్‌లోని ఫ్యాక్షనిస్టు, అహంకార లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.

జగన్ సభలో ఉండి పోరాడాల్సింది: నారాయణ
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ధియేటర్లు, బజార్లలో ప్రవర్తించే రౌడీల్లా కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో కమ్యూనిస్టులు లేని లోటు కనిపిస్తోందన్నారు. విపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విపక్ష నేత వైయస్ జగన్ సభ నుంచి వాకౌట్ చేయడం కన్నా సభలోనే ఉండి ప్రభుత్వంపై పోరాడాల్సిందన్నారు. జగన్‌ను చూస్తేనే చంద్రబాబు తట్టుకోలేకపోతన్నారని, ఇది పద్దతి కాదన్నారు.
'మీ దయ వల్ల నేను ఎక్కడెళ్లినా చికెన్ పెడుతున్నారు' అని నారాయణ మీడియాపై సరదా వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలకు మీడియా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. శాసన మండలిలో సీపీఐ సభ్యుడు చంద్రశేఖర్ గంటకుపైగా ఎంతో బాగా మాట్లాడినా ఒక్క ముక్క కూడా రాయలేదన్నారు. ఆయన అసెంబ్లీ ఆవరణలో సిగరెట్ కాల్చే ఫోటోకు మాత్రం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications