‘పవన్! పన్నీరుసెల్వంలా?, అప్పుడు చిరుపై మనసుపారేసుకొని! కేసీఆర్‌కు ప్రశంస - బాబుకు విమర్శా?’
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ నేతల ఎదురుదాడి కొనసాగుతోంది. తాజాగా, ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. ఆయన శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డిలా పవన్ పార్టీ కూడా మిస్డ్ కాల్ పార్టీ అయిపోయిందని ఎద్దేవా చేశారు.
Recommended Video

పొరపాటున మిస్డ్ కాల్ వెళ్లినా జనసేనలో చేరిపోయినట్లేనా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. పాపం పవన్‌కి ఓ గుణం ఉందని.. చిన్నపిల్లాడిలా ఎవరి దగ్గరుంటే వారిపై మనసుపారేసుకుంటారని సోమిరెడ్డి సెటైర్లు వేశారు.

చిరుపై మనసు పారేసుకుని..
పవన్.. ఎవరితోనైనా సాన్నిహిత్యం పెంచుకుంటే వారిపై మనసు పారేసుకుంటారని.. ఆ తర్వాత ఆరేసుకుంటారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. చిరంజీవి పార్టీలో పవన్ పెత్తనం చెలాయించారని అన్నారు. అప్పుడు అన్నపై మనసుపారేసుకుని.. ఆ తర్వాత కొంత కాలానికే ఆరేసుకున్నారని అన్నారు.

అవిశ్వాసం స్పందించరేం
వైసీపీ అవిశ్వాసం పెడితే.. ఇతర పార్టీల ఎంపీల మద్దతు కూడగాడతానని చెప్పిన పవన్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని సోమిరెడ్డి ప్రశ్నించారు. గుంటూరు సభలో జగన్ పార్టీ పెడతామన్న అవిశ్వాసం అంశంపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రధాని మోడీపై ఎందుకు విమర్శలు చేయలేదని ప్రశ్నించారు.

పవన్.. సడెన్‌గా పన్నీరుసెల్వంలా
సినిమాలో ఇంటర్వెల్ వరకూ హీరోలా ఉండి... సెకెండ్ ఆఫ్ నుంచి భిన్నమైన రోల్ పోషించినట్లుగా పవన్ వ్యవహరిస్తున్నాడని సోమిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం మోడీపై పోరాడుతానన్న పవన్ కళ్యాణ్.. సడెన్‌గా పన్నీరుసెల్వంలా ఎందుకు మారిపోయారని సోమిరెడ్డి నిలదీశారు. అసలు పవన్ బహిరంగ సభ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ లను తిట్టేందుకు సభ పెట్టారా? అని నిలదీశారు.

మోడీ పేరెత్తలేదేం?.. అజ్ఞాతవాసిలా..
పవన్.. గబ్బర్ సింగ్ నుంచి అజ్ఞాతవాసిగా అయ్యారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.
మోడీని, కేంద్రాన్ని తిట్టడానికి పవన్ కి ధైర్యం రావడం లేదా? అని ప్రశ్నించారు.
పవన్.. వామపక్ష భావజాలం నుచి మోడీకి దగ్గరకావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. మోడీ పేరెత్తకుండా విమర్శలు చేయడం దేనికి సంకేతమని అన్నారు.

జేఎఫ్‌సీ బాబును తిట్టమని చెప్పిందా.. వెనుక ఆయనే
నిధులపై వేసిన జేఎఫ్‌సీ కమిటీతో పవన్ ఏం సాధించారని సోమిరెడ్డి ప్రశ్నించారు. స్టడీ చేస్తామని నియమించిన కమిటీ.. బాబును తిట్టమని చెప్పిందా? అని నిలదీశారు. పవన్ పక్కన మాజీ ఎమ్మెల్సీ చేరాడని, ఆయన అడుగు పెడితే ఏదో జరుగుతుందని అనుకున్నానని, అలాగే జరిగిందని సోమిరెడ్డి అన్నారు. జగన్ పక్కనా ఓ మాజీ ఎమ్మెల్యే ఉండి ఇలాంటి పనులే చేయిస్తున్నారని ఆరోపించారు.

చిరంజీవి పెట్టినప్పుడలా? ఇప్పుడిలానా?
చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కాపులకు రిజర్వేషన్లు అని ఎందుకు అన్నారని పవన్ ని సోమిరెడ్డి ప్రశ్నించారు. ముద్రగడ కాపుల రిజర్వేషన్ల కోసం బస్సులు తగలబెడుతుంటే ఎందుకు ఆపలేదని అన్నారు. తాము కాపుల రిజర్వేషన్ల కోసం జస్టిస్ మంజునాథ కమిషన్ వేశామని, కాపులపై రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తోందని సోమిరెడ్డి చెప్పారు.

కేసీఆర్ ప్రశంస.. బాబుకు విమర్శా?
ఎస్సీల రిజర్వేషన్లు పెంచాలన్న కేసీఆర్‌ను ప్రశంసించిన పవన్.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్న చంద్రబాబును విమర్శించడమేంటని సోమిరెడ్డి నిలదీశారు.
గత ప్రభుత్వాల హయాంలో ఎర్రచందనం ఎటుపోతుందో తెలిసేది కాదని, తాము ఇప్పుడు వేలం వేసి ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం తీసుకొస్తుంటే తమపై విమర్శలు చేయడమేంటని పవన్ ని ప్రశ్నించారు. ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి, స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టామని చెప్పారు.

అవగాహన ఉండే మాట్లాడుతున్నారా?
అవినీతిలో ఏపీ నెంబర్ 1 అని ఎలా చెబుతారని పవన్‌ని సోమిరెడ్డి ప్రశ్నించారు. 2014 వరకు ఏపీ అవినీతిలో 1వ స్థానంలో ఉందని తమ ప్రభుత్వం వచ్చాక.. ఇప్పుడు 19వ స్థానానికి తీసుకొచ్చామని అన్నారు. పవన్ గతంలో దౌర్జన్యానికి దిగిన ఘటనలు గుర్తు లేదా? అని అన్నారు. తాము రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పారు.

పుట్టుకతోనే భువనేశ్వరి సంపన్నురాలు.. లోకేష్‌పై విమర్శలా?
యువ నాయకుడు లోకేష్.. ఎంతో కష్టపడుతున్నాడని, ప్రజలకు ఏదో చేయాలని రాజకీయాల్లోకి వస్తే అలాంటి నాయకుడిపై విమర్శలు చేస్తారా? అంటూ పవన్ పై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీలో వ్యక్తులు ఎంతో నిజాయితీగా ఉంటారని, లోకేష్ తల్లి భువనేశ్వరి పుట్టుకతోనే సంపన్నురాలని సోమిరెడ్డి చెప్పారు. వారు నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటుంటే విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు.

కోట్ల భూములు లక్షలకే ఎలా వచ్చాయి?
చంద్రబాబుపై దివంగత సీఎం వైయస్ 26 కమిటీలు వేశారని, అయినా ఏం జరిగిందో అందరికీ తెలుసుని సోమిరెడ్డి చెప్పారు. డబ్బు తీసుకోండి తనకే ఓట్లేయండని పవన్ చెప్పిన మాటలు వింటుంటే.. సినీనటుడిలానే మాట్లాడుతున్నారని అర్థమవుతోందని అన్నారు. మంగళగిరిలో ఎంతో విలువైన 2 ఎకరాల భూమిని పవన్ కళ్యాణ్ కేవలం రూ.40లక్షలకే ఎలా దక్కించుకోగలిగారని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఆ భూమి వాస్తవ ధర రూ.4 నుంచి 5కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ఆ ప్రాంతంలో తాను కూడా భూమి కొనుగోలు చేయలేనని, తన వద్ద అంత డబ్బు లేదని సోమిరెడ్డి చెప్పారు. తన సొంత గ్రామంలో తప్ప ఎక్కడా నివాసం లేదని తెలిపారు.












Click it and Unblock the Notifications