మీకు అదే గతి.. బీజేపీపై గొంతు పెంచిన టిడిపి: మోడీకి సోమిరెడ్డి హెచ్చరిక
నెల్లూరు: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రమంత్రులు, బీజేపీ చెబుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీనే టార్గెట్ చేస్తున్నారు. టిడిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం నాడు బీజేపీ పైన విమర్శలు గుప్పించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని, ఆ హామీని నెరవేర్చకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే ఆ పార్టీకి పడుతుందని హెచ్చరించారు. హోదా విషయంలో ప్రధాని మోడీ మాట నిలబెట్టుకోకుంటే దేశవ్యాప్తంగా ఆయన విశ్వసనీయత కోల్పోతారని చెప్పారు.
ఏపీకి ఇప్పటి వరకు ఏం నిధులు తెచ్చారో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అరకొర నిధులే వచ్చాయని ధ్వజమెత్తారు. నీతి అయోగ్ చైర్మన్.. ప్రధాని, పార్లమెంటు కంటే పెద్దది కాదు కదా అన్నారు.

తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల పైన కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ మాట్లాడారు. తెలంగాణలో చేపట్టే ప్రాజెక్టులకు అనుమతులు లేవని చెప్పారు. రైతులు సుప్రీం కోర్టుకు వెళ్తే నెల రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు.
అపెక్స్ కౌన్సెల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టుల పైన జగన్ దీక్షలు విడ్డూరమన్నారు. ఏపీ ప్రజలు జగన్‌ను ఎప్పటికీ నమ్మరని చెప్పారు.
పనామా పేపర్స్‌లలో వచ్చిన పేర్లన్నీ వైసిపి అధినేత జగన్ మనుషులవేనని ఆరోపించారు. జగన్ తన సొంత మీడియా ద్వారా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. జగన్ తీరును ఎవరూ హర్షించరని సోమిరెడ్డి ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications