మేమే హీరోలం, ఏం చేయలేకపోతున్నాం, బాబు గొప్పలు: ఏకిపారేసిన వీర్రాజు
ఏపీలో 2019లో తామే హీరోలం అని బిజెపి శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు ఆదివారం అన్నారు. ఈ సమయంలో ఆయన టిడిపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
అమరావతి: ఏపీలో 2019లో తామే హీరోలం అని బిజెపి శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు ఆదివారం అన్నారు. ఈ సమయంలో ఆయన టిడిపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

మిత్రపక్షంగా ఉన్నప్పటికీ నిరాశే
పోలవరం ప్రాజెక్టు నుంచి మరుగుదొడ్ల వరకు కేంద్రం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని తమ ఘనతగా చెప్పుకుంటోందని వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తమ కార్యకర్తలకు ఏమీ చేయలేకపోతుండటంతో నిరాశ చెందుతున్నానని అన్నారు.

కేంద్రం నిధులతో చంద్రబాబు గొప్పలు
ఇప్పటి వరకూ పోలవరానికి కేంద్రం రూ.6వేల కోట్లు విడుదల చేసిందని, ఇంత చేస్తున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, టిడిపి నేతలు అంతా తామే చేసినట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులతో చంద్రబాబు గొప్పలకు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవన్నీ బిజెపి ఘనతలు
మిత్రపక్షంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ద్రోహాన్ని ఎదుర్కొని, 2019 ఎన్నికల్లో విజేతగా నిలుస్తామని సోము వీర్రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపుకు గురయ్యే తెలంగాణలోని ప్రాంతాలను ఏపీలో కలపడం, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం బిజెపి ఘనత అన్నారు.

మేమూ పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్తాం
నెలకోసారి పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులన్నీ తమ ప్రభుత్వమే చేస్తున్నట్లు, నిధులు కూడా వారే విడుదల చేసినట్లు చంద్రబాబు ఆర్భాటాలకు పోతున్నారని వీర్రాజు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకూ కేంద్రం రూ.5వేలకోట్లు ఇచ్చిందని, ఇటీవలే మరో రూ.వెయ్యికోట్లు ఇచ్చిందన్నారు. త్వరలో తాము కూడా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి వాస్తవాలను ప్రకటిస్తామన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులకు ఎన్టీఆర్ స్వగృహ అని..
కేంద్రం 10 లక్షల ఇళ్లు కేటాయించి దానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పేరుపెడితే, చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ స్వగృహ పేరుతో ఇటీవల గృహప్రవేశాలు చేశారని సోము వీర్రాజు మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో కేంద్రానికి సంబంధంలేదనట్లుగా కనీసం బ్యానర్లలో ప్రధాని మోడీ ఫొటోలను పెట్టడం లేదన్నారు. తాను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందో లేదో టిడిపి నేతల్ని అడిగితే చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications