అవసరమైనప్పుడు లవ్ చేయడంలో చంద్రబాబు సమర్ధుడు: తర్వాత ఏం చేస్తారంటే.. సోము వీర్రాజు సెటైర్లు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక అవకాశవాది అని మండిపడ్డారు. ఆయనకు అవసరమైనప్పుడు ఎవరినైనా లవ్ చేస్తాడు అంటూ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.1997 లో కాంగ్రెస్ లో చంద్రబాబు చక్రం తిప్పారని, అప్పటినుండి అవసరాన్ని బట్టి ఆయన అన్ని పార్టీలను లవ్ చేస్తూనే ఉన్నాడని సోము వీర్రాజు చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అవసరమైనప్పుడు మాత్రమే చంద్రబాబు లవ్: సోము వీర్రాజు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేసిన సోము వీర్రాజు అవసరమైనప్పుడు లవ్ చేయడంలో చంద్రబాబు సమర్ధుడు అంటూ వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన లవ్ చేశారని, చంద్రబాబు అవకాశవాది అని తేల్చి చెప్పారు. అవసరమైనప్పుడు లవ్ చేస్తారని ఆ తర్వాత ఏం చేస్తారో నా నోటితో నేను చెప్పలేను అంటూ సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో జరిగిన సభలో జనసేనతో పొత్తు గురించి టీడీపీ కార్యకర్త మాట్లాడిన సమయంలో పొత్తులు ఎప్పుడు వన్ సైడ్ గా ఉండకూడదని రెండు వైపులా పొత్తులపై ఆసక్తి ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.

మోడీ భద్రత అంశంపై గవర్నర్ ను కలుస్తాం: సోము వీర్రాజు
ఇక ఈ వ్యాఖ్యలపైన సోము వీర్రాజు చంద్రబాబును టార్గెట్ చేశారు. జనసేన తమ మిత్రపక్షమని పేర్కొన్న సోము వీర్రాజు చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరితో పొత్తు పెట్టుకోవడానికి అయినా చంద్రబాబు ఎప్పుడైనా అవసరాన్నిబట్టి రెడీగా ఉంటారు అంటూ తేల్చి చెప్పారు. ఇక ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో ఎదురైన ఘటనపై స్పందించిన సోము వీర్రాజు ప్రధాని మోడీ భద్రతకు భంగం కలిగేలా పంజాబ్లో పరిస్థితులను సృష్టించారని కాంగ్రెస్ పాలక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ భద్రతకు భంగం కలిగిన వ్యవహారంపై నిరసనలు తెలియజేస్తామని, ఈ విషయంపై ఈరోజు సాయంత్రం గవర్నర్ ను కూడా కలవనున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు.

కుప్పం పర్యటనలో పొత్తులపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక ఇప్పటికే ఏపీలో దూకుడు పెంచిన బిజెపి నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తూనే, మరోవైపు చంద్రబాబును తూర్పారబడుతున్నారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు బహిరంగ సభలో జనసేన తో పొత్తు పెట్టుకుంటారా అని ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానంగా.. అదే తమ్ముడు నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావే అనుకో.. అదే సరిపోదు ఆ అమ్మాయి కూడా నిన్ను లవ్ చేయాలి కదా, రెండు వైపుల నుంచీ లవ్ ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వ్యాఖ్యలపై సోము వీర్రాజు సెటైర్లు వేశారు.

2014ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీతో పొత్తు
ఇదిలా ఉంటే 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పొత్తులతో పోటీ చేసింది. ఆ సమయంలో జనసేన కూడా టీడీపీకి మద్దతు ఇచ్చింది. 2014 ఎన్నికల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ పొత్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలోనూ టిడిపి నేతలకు కేంద్రమంత్రులుగా అవకాశం లభించింది. ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో ఇక ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఎన్నికలకు ఏడాది ముందు టిడిపి కేంద్రం నుండి వైదొలగింది.

2019 ఎన్నికల్లో ఒంటరిగా టీడీపీ పోటీ
ఆ తర్వాత 2019 ఎన్నికలలో జనసేనతో పొత్తు కోసం ప్రయత్నం చేసినప్పటికీ, అది విఫలం కాగా ఏ పార్టీతో పొత్తులు లేకుండానే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది టిడిపి. జనసేన లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్లగా, బిజెపి ఒంటరిగానే పోటీ చేసింది. ఈ ఎన్నికలలో బీజేపీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేక పోగా, జనసేన ఒక స్థానాన్ని దక్కించుకున్నా అది కాస్త వైసిపికి అనుకూలంగా మారింది.

ఇప్పుడు బీజేపీ జనసేన పొత్తు.. పొత్తులపై మొదలైన చర్చ
ఇక రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రస్తుతం ప్రయాణం సాగిస్తోంది. 2024 ఎన్నికల వరకు ఈ పొత్తులు ఉంటాయని జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల టిడిపి జనసేనకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, జనసేన టిడిపితో పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్నది చర్చనీయాంశం కాగా, చంద్రబాబు పొత్తుల వ్యాఖ్యలతో మరోమారు ఏపీలో దుమారం రేగింది.












Click it and Unblock the Notifications