జగన్ దగ్గర నవరత్నాలుంటే మోడీదగ్గర 90రత్నాలు; అధికారమిస్తే మూడేళ్ళలో అమరావతి నిర్మాణం: సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ బిజెపి ప్రజాగ్రహ సభను విజయవాడ వేదికగా నిర్వహిస్తోంది. ఇక ఈ సభలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పష్టం చేశారు.

బీజేపీకి అధికారం ఇస్తే మూడేళ్ళలో అమరావతి నిర్మాణం
ప్రజాగ్రహ సభలో కీలక వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు బిజెపికి అధికారమిస్తే మూడేళ్లలో రాజధాని అమరావతిని పూర్తిచేస్తామని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని కేంద్ర పథకాలకు వైసిపి స్టిక్కర్లు అంటిస్తున్నారని సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. రాజధానిలో రైతుల సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చిన సోము వీర్రాజు ఏపీ రాజధానిపై ఏడు వేల కోట్లు ఖర్చు చేశామన్న వారిని రైతులు నిలదీయాలని ప్రశ్నించారు.

మనం ఏమైనా జైలుకు వెళ్ళామా ? ఎందుకు భయపడాలి
రాజధానిగా అమరావతి కొనసాగుతుందని బిజెపి నమ్మింది అని, అందుకోసమే బిజెపి కేంద్ర కార్యాలయాన్ని రాజధాని అమరావతి లోనే ఏర్పాటు చేసుకుంన్నదని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఎయిమ్స్ ను కూడా మంగళగిరిలో నిర్మించామని పేర్కొన్న ఆయన రాజధాని అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చామని స్పష్టం చేశారు. రాజకీయాల్లో నిరాడంబరత్వం చూపించిన పార్టీ బిజెపి అని పేర్కొన్న సోము వీర్రాజు జగన్ కు ఏం చూపించాలో అదిచూపించే పార్టీ బిజెపి నేనని,మనం ఎందుకు భయపడాలి అంటూ ప్రశ్నించారు. మనం ఎప్పుడైనా జైలుకు వెళ్ళామా ప్రశ్నించిన ఆయన భవిష్యత్తులో వెళ్తామా అంటూ అలాంటి అవకాశమే లేదని తేల్చి చెప్పారు.

కేంద్రం నిధులిస్తే వాటికి వైసీపీ స్టిక్కర్లు
అధికారంలోకి వస్తే ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని సోము వీర్రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావాలని సోము వీర్రాజు ఆకాంక్షించారు .ఉత్తరాంధ్రను, రాయలసీమను అభివృద్ధి చేసే పార్టీ బీజేపీనేనని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ కమిషన్ లతో కాలక్షేపం చేస్తున్నాయని ఆరోపించారు సోము వీర్రాజు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే జగన్, చంద్రబాబును వాటికి స్టిక్కర్లు వేసి తమవిగా ప్రచారం చేసుకున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. స్కూళ్ళ బలోపేతానికి కేంద్ర నాలుగు వేల కోట్ల నిధులు ఇస్తే వాటిని పక్కదారి పట్టిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో కార్పొరేట్ తరహా విద్యను అందించడం కోసం నిధులు ఇచ్చిందని సోము వీర్రాజు వెల్లడించారు.

కమ్యూనిస్ట్ లపై మండిపడిన సోము వీర్రాజు
అంతేకాదు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని ముందు చంద్రబాబును అడగాలని చంద్రబాబుపై మండిపడ్డ సోము వీర్రాజు ప్రత్యేక హోదా నీతిఆయోగ్ పరిధిలో ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని అమ్మేస్తున్నారు అని విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికీ కాపాడుతున్న పార్టీ మాదేనని, స్టీల్ ప్లాంట్ నష్టం మూడు వేల కోట్లను ఇప్పటికే భర్తీ చేస్తున్నామని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇక కమ్యూనిస్టు పార్టీ నాయకుల పై మండిపడిన సోము వీర్రాజు యూనియన్ ల పేరుతో పాఠశాలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులు పేద పిల్లల ఆహార నిధులను దోచుకున్నారని, ట్రేడింగ్ పార్టీలకు ఏజెంట్లు కమ్యూనిస్టు పార్టీలు అని సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బీజేపీకి ఓటేస్తే 70 రూపాయలకే చీప్ లిక్కర్
వైసిపి హయాంలో ప్రభుత్వమే పచ్చి సారా కాస్తుందని పేర్కొన్న సోము వీర్రాజు మూడు రూపాయల విలువ చేసే మద్యాన్ని 25 రూపాయలకు కొని, 250 రూపాయలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్ ఇలాంటి చెత్త పేర్లతో బ్రాండ్లను తీసుకొచ్చి అమ్ముతున్నారని బిజెపికి ఓటు వేస్తే 70 రూపాయలకు చీప్ లిక్కర్ ఇస్తామని, ఆదాయం బాగుంటే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మద్యం రూపంలో ప్రజలను దోచుకుని మళ్లీ వారికే ఇస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

జగన్ దగ్గర నవరత్నాలు ఉంటే మోడీ దగ్గర 90 రత్నాలున్నాయి
సంక్షేమ పథకాల అమలులో వైసిపి కంటే బీజేపీనే ముందున్నదని పేర్కొన్న ఆయన జగన్ దగ్గర నవరత్నాలు ఉంటే మోదీ దగ్గర 90 రత్నాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలన చేతకాక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద ఏపీకి 50 వేల కోట్లు ఇచ్చామని సోము వీర్రాజు గుర్తుచేశారు. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ సోము వీర్రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడితే ఏపీ పాలకులు కాంట్రాక్టర్ల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం అంచనా విషయంలో టిడిపి, వైసిపి అవినీతికి పాల్పడుతున్నారని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

వేలకోట్ల నిధులు ఇస్తుంటే ప్రత్యేక హోదా రాజకీయాలు దేనికి
ఏపీకి వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ప్రత్యేక హోదా అంటూ రాజకీయాలు చేస్తున్నారంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. బిజెపి పార్టీ ఏమీ అణా కాణీ పార్టీ కాదని, తోలు తీసే పార్టీ అని సోము వీర్రాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల కోరికలు తీర్చే సత్తా బీజేపీకి ఉందని సోము వీర్రాజు పేర్కొన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని వ్యాక్సిన్ తయారు చేయించి ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత కూడా బిజెపి దేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications