రేపు విశాఖ నుంచి బెంగళూరు వెళ్తున్నారా ? ఇది మీ కోసమే..!
ఏపీలోని విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రేపు (మంగళవారం) ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా దీపావళి పండుగ కోసం విశాఖకు వచ్చిన బెంగళూరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక రైలును నడుపుతోంది. ఇది కేవలం వన్ వే రైలు మాత్రమే. అంటే విశాఖ నుంచి బెంగళూరుకు రేపు ఒక్కరోజు మాత్రమే ప్రయాణిస్తుంది. ఈ రైలు వివరాలు, హాల్ట్ లు, అందుబాటులో ఉన్న బోగీల వివరాలు ఓసారి చూద్దాం..
విశాఖ నుంచి రేపు (మంగళవారం) ఉదయం 8.20కి బయలుదేరే ఈ ప్రత్యేక రైలు ఎల్లుండి (బుధవారం) ఉదయం 6.45కు ఎస్.ఎమ్.వి.టి. బెంగళూరు స్టేషన్ కు చేరుకుంటుంది. విశాఖ నుంచి బయలుదేరే ఈ రైలుకు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జోలార్ పెట్టయ్, కుప్పం, బంగారపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారు.

ఈ స్పెషల్ రైలులో ఏసీ టూటైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంచారు. వీటికి ఇవాళే రిజర్వేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే జనరల్ టికెట్లు అందుబాటులో ఉంటే చివరి నిమిషంలో కూడా ఆయా స్టేషన్లలో తీసుకుని ఈ రైల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. దీపావళి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో ఈ ప్రత్యేక రైలును అధికారులు అందుబాటులోకి తెచ్చారు. కాబట్టి ప్రయాణికులు ఆన్ లైన్లో లేదా మొబైల్ యాప్ లో ఈ రైలు టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు.












Click it and Unblock the Notifications