నర్సాపూర్, అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!!
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రెండు ప్రధాన మార్గాల్లో ఈ రైళ్లను నడపనుంది. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాలకు నడుస్తున్న ప్రధాన రైళ్లు సంక్రాంతి వరకు రిజర్వేషన్లు పూర్తయ్యాయి. సంక్రాంతి సమయంలోనూ రిజర్వేషన్ కు అవకాశం దక్కటం లేదు. దీంతో, సంక్రాంతి సమయంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో నర్సాపూర్, అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లను అధికారులు ప్రకటించారు.
సికింద్రాబాద్ నుంచి విశాఖ కు పలు రెగ్యులర్ రైళ్లు కొనసాగుతున్నాయి. అన్ని రైళ్లుకు బారీగా డిమాండ్ పెరిగింది. అదే విధంగా గోదావరి జిల్లాలకు పెరుగుతున్న డిమాండ్ తో రెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ నెల 12న నర్సాపురం నుంచి సికింద్రాబాద్ (07455) కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసారు. 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ కోచ్ లతో ఈ రైలు నడవ నుంది. 12వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు నర్సాపూర్ నుంచి బయల్దేరి పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికూడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరనుంది.

అదే విధంగా 15వ తేదీ అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ (07179) ప్రత్యేక రైలు సాయంత్రం 5.35 గంటలకు బయల్దేరి తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడుదవోలు, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది.
ఈ ప్రత్యేక రైలులో 1 ఏసీ, 2 ఏసీ, 3 ఏసీతో పాటుగా స్లీపర్ .. జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఇక.. విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలులోనూ సంక్రాంతికి వెయిటింగ్ లిస్టు భారీగా ఉంది. దీంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేసారు. సంక్రాంతికి సంబంధించి ప్రత్యేక రైళ్లు..రూట్ - షెడ్యూల్ పైన కసరత్తు చేస్తున్న అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications