కలిసేందుకు స్పీకర్ నో: 3గంటలు లగడపాటి పడిగాపులు
న్యూఢిల్లీ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు లోకసభ స్పీకర్ మీరా కుమార్ ముఖం చాటేశారు! సమైక్యాంధ్ర కోసం తన రాజీనామాను ఆమోదింప చేసుకునేందుకు లగడపాటి గురువారం తీవ్ర ప్రయత్నాలు చేశారు. స్పీకర్ మాత్రం లగడపాటికి అపాయింటుమెంట్ ఇవ్వలేదు. ఆయనను కలుసుకునేందుకు నిరాకరించారు. దీంతో తన రాజీనామాను వెంటనే ఆమోదించకపోతే వచ్చే సోమవారం నుండి పార్లమెంటు ఆవరణలో దీక్ష చేస్తానని లగడపాటి హెచ్చరించారు.
లోక్‌సభ సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినందుకే లాగడపాటిని కలుసుకునేందుకు స్పీకర్ నిరాకరించి ఉంటారని అంటున్నారు. గురువారం దాదాపు మూడు గంటల పాటు పార్లమెంటు ఆవరణలో మీరా కుమార్ అప్పాయింట్‌మెంట్ కోసం లగడపాటి పడిగాపులుకాశారు. పార్లమెంటు ఆవరణలోని తమ చాంబర్‌లో ఉన్నప్పటికీ లగడపాటి రాజగోపాల్‌ను కలుసుకునేందుకు స్పీకర్ సమ్మతించకపోవడం గమనార్హం.

ఢిల్లీ హైకోర్టులో కేసు వేసినందుకే మీరాకుమార్ ఆగ్రహంతో ఉన్నారని పార్లమెంటు అధికారులు సూచించగా తన రాజీనామాను ఆమోదిస్తామనే హామీ ఇస్తేనే కోర్టు కేసును వెంటనే ఉపసంహరించుకుంటానని లగడపాటి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కోర్టు కేసును ఉపసంహరించుకోనంత వరకు రాజీనామాను ఆమోదించటం జరగదని లోక్‌సభ అధికారులు ఆయనకు స్పష్టం చేశారు.
కోర్టులో కేసు ఉన్నప్పుడు స్పీకర్ ఎలా అప్పాయింట్‌మెంట్ ఇస్తారని లగడపాటిని అధికారులు ప్రశ్నించినా, మూడు గంటల పాటు లోక్‌సభ ఆవరణలోనే లగడపాటి ఎదురు చూశారు. పలుమార్లు సెక్రటరీ జనరల్ కార్యాలయానికి వెళ్లి అప్పాయింట్‌మెంట్ గురించి వాకబు చేశారు.












Click it and Unblock the Notifications