పుష్కరాల బులిటెన్: 38 ఘాట్లకు రాని నీరు, భక్తుల తీవ్ర అసంతృప్తి, కానిస్టేబుల్ మృతి
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కృష్ణా పుష్కరాల్లో సంతృప్తిగా నదీ స్నానం చేద్దామని గంపెడాశతో వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. శ్రీశైలం నుంచి నదిలో నీరు వస్తున్నప్పటికీ, దిగువన ముఖ్యంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కింద ఏర్పాటు చేసిన ఏ ఘాట్‌కు కూడా నీరు చేరడం లేదు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు పైపుల ద్వారా జల్లు స్నానాలు చేసే ఏర్పాటు చేశారు. దీనిపై భక్తులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. మరోవైపు కొన్ని ఘాట్లలో రెండడుగుల లోతులో నీరు కూడా లేదు. దీంతో మోకాళ్లలోతు నీటిలో మునకెలా వేయాలో తెలియక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నాగార్జున సాగర్ దిగువన దేశాలమ్మ, సత్రశాల పరిధిలో రెండు అడుగుల మేరకు నీరుండగా, దైదలో ఒక అడుగు మేరకు మాత్రమే నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టు సమీపంలోని గోవిందాపురం, ఎల్లంపల్లి, రేగులగడ్డల్లో అసలు నీరే లేకపోవడం గమనార్హం. ఇక విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో 12 అడుగుల మేరకు నీరుంది.

దిగువ ఘాట్లలో నీరు లేదంటూ భక్తులు గొడవ చేయడంతో నీరు విడుదల చేయడంతో అది 10 అడుగులకు చేరింది. మరోవైపు ప్రకాశం బ్యారేజి దిగువన నిర్మించిన పెనుమూడి ఘాట్‌కు ఏపీ ప్రభుత్వం అంగరంగ వైభవంగా అరకిలోమీటరు మేర నిర్మించింది. అయితే ఈ ఘాట్‌లో భక్తులు స్నానం చేసేంతగా నీరు లేదు.
భక్తుల స్నానాలకు చాలినంత నీరు వదలాలంటే, బ్యారేజ్ ఎగువన దుర్ఘా ఘాట్ కు నీరు చాలని పరిస్థితి నెలకొంది. బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో 38 ఘాట్లను అధికారులు ఏర్పాటు చేయగా, ఏ ఘాట్ దగ్గర కూడా నిండా మునిగేంత నీరు లేదు. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి నీరు వస్తేనే కానీ భక్తులు సంతృప్తిగా పుష్కర స్నానం చేయలేని పరిస్థితి నెలకొంది.
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
కృష్ణా పుష్కరాల బందోబస్తు నిమిత్తం తిరుపతి నుంచి వచ్చిన కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఏపీ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకట్రావు, పుష్కర విధుల నిమిత్తం కృష్ణా జిల్లాలోని గూడవల్లి ప్రాంతానికి వచ్చారు.
విధి నిర్వహణలో భాగంగా రోడ్డు దాటుతున్న వేళ, ఓ ఇన్నోవా కారు వచ్చి అతన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రోడ్డు డివైడరుకు వెంకట్రావు తల తగలడంతో, ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుతున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
సీతానగరం ఘాట్‌లో పూజాకార్యక్రమాలను నిలిపివేసిన పురోహితులు
ఏపీలో కృష్ణా పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే, గుంటూరు జిల్లా సీతానగరం పుష్కరఘాట్‌లో పురోహితులు పూజాకార్యక్రమాలు నిలిపివేశారు. పుష్కరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల పక్కనే పిండప్రదానం షెడ్లు ఏర్పాటు చేశారంటూ పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పూజా కార్యక్రమాలు నిలిచిపోగా, భక్తులు ఇబ్బంది పడుతున్నారు.












Click it and Unblock the Notifications