మహానాడులో... మహా విందు:ఏర్పాట్లతో సహా అన్నీ... "మహా...మహా"నే!
విజయవాడ:టిడిపి మహానాడు పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తిని రగల్చడమే కాదు...పసందైన విందుకు కూడా కేరాఫ్ అడ్రస్సేనని హజరైనవారు ముక్తకంఠంతో చెబుతుంటారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చే తెలుగుదేశం అభిమానులందరికీ వివిధరకాలైన రుచికరమైన వంటకాలు వండి వడ్డించడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు.

అందుకే ఈ మహా విందును వండి వడ్డన చేయడం ఒక యజ్ఞం లాంటిదే కాగా దీన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు నిర్వాహక కమిటీలు సర్వశక్తులు ఒడ్డాల్సిందే. పైగా ఈ ఏడాది మహానాడుకు గడచిన మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ లేనంత సంఖ్యలో టిడిపి అభిమానులు తరలివచ్చారని నిర్వాహకులు అంటున్నారు. ఆహుతులందరికీ మొత్తం 1200 మంది సిబ్బందితో మహా పాకశాలలో వంటా వార్పూ జరుగుతోందని తెలిపారు.

వంటా వార్పు...ఇలా
వీఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ సెంట్రల్ లైబ్రరీ వెనుక భాగంలోని విశాలమైన ఖాళీస్థలంలో అంబికా క్యాటరర్స్ ఈ వంటల తయారీ చేస్తోంది. మొత్తం 1200 మంది సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తోంది. ఈ మొత్తం సిబ్బందిలో 400 మంది వంటవాళ్లే కావడం గమనార్హం. వంటలు మరింత రుచిగా ఉండేందుకు ఇక్కడ కేవలం కట్టెల పొయ్యలే వినియోగిస్తుండటం మరో విశేషం. ఇలా మొత్తం 110 కట్టెల పొయ్యిల మీద వంటలు జరుగుతున్నాయి. మొత్తం సిబ్బందిలో 400 మంది వంటవాళ్లు కాక మిగిలిన 800 మంది వడ్డన సంబంధించిన పనులు చూస్తున్నారు.

వంటలు...చేరవేసేదిలా
ఇక వండిన వంటకాలను వివిధ చోట్ల ఉన్న వడ్డన ప్రదేశాలకు చేర్చేందుకు ఎల్లప్పుడూ 10 వాహనాలు సిద్ధంగా ఉంటాయి. వంట సిబ్బందితో సంబంధం లేకుండా ప్రతి విందు ప్రదేశానికి 10 మంది చొప్పున మొత్తం 70 మంది వాలంటీర్లు ఈ వడ్డన కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకు సదా సిద్దంగా ఉంటారు. వీరందరినీ మరో 10 మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తూ ఉంటారు. మళ్లీ వీళ్లపై మరో ఐదుగురు ఇన్‌ఛార్జిలు ఉంటారు. భోజనశాలలో అవసరాలను బట్టి ఏమేం కావాలో వాలంటీర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుని సూపర్ వైజర్లకు చేరవేస్తే...వాళ్లు ఇన్‌చార్జిల దృష్టికి తీసుకువెళతారు. ఆ తరువాత సదరు ఇన్‌చార్జి నేరుగా కిచెన్ ఇన్‌చార్జిలకు వాకీ టాకీలలో సమచారం తెలియచేస్తాడు. దీంతో ఆ కిచెన్ ఇన్‌చార్జి అక్కడ ఉన్న సప్లయర్లకు వెంటనే ఫలానా నెంబర్ ఫుడ్‌కోర్టుకు ఫలానా వంటకాలను తీసుకువెళ్ళాలని ఆదేశిస్తారు. ఆ ప్రకారం వెంటనే ఆహార పదార్థాలు ఆయా కౌంటర్ల వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది.

మంత్రుల పర్యవేక్షణ...మహా రద్దీ
విందు ఏర్పాట్లలో తేడా వస్తే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి స్వయంగా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలు ఈ వంట ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పుట్టిన రోజును పురస్కరించుకుని మహానాడు విందులో ఆయనకు ఇష్టమైన వంటకాలను వడ్డించామని నిర్వాహకులు తెలిపారు. గత మహానాడుల్లో ఎన్నడూ లేనంత రద్దీ ఈ ఏడాది మహానాడులో కనిపిస్తోందని వారు చెబుతున్నారు. తొలిరోజు రికార్డు స్థాయిలో 54 వేలమంది భోజనాలు చేశారని...రెండవ రోజు మధ్యాహ్నం మూడు గంటల నాటికి 70 వేలమంది భోజనాలు చేశారుని చెప్పారు. సోమవారం ఎన్టీ రామారావు పుట్టిన రోజు సందర్భంగా అత్యధిక సంఖ్యలో అంచనాలకు మించి జనాలు భోజనానికి వచ్చినా అందరికీ సంతృప్తికరంగా భోజనాలను వడ్డించామని సంతోషం వ్యక్తం చేశారు.

మహా...వంటలు ఇవే...
ఈ మహానాడులో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, సాయంత్రం స్నాక్స్ ఇలా నాలుగుసార్లు వడ్డనలు జరుగుతున్నాయి. మహనాడు 3 మూడు రోజులు మెనూ వివరాలు ఇవి:ఈ నెల 27వ తేదీన...అల్పాహారం: స్వీట్ రవ్వకేసరి, గోధుమ రవ్వ స్వీటు, ఇడ్లీ, మైసూరు బొండా, టమాటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టీ, కాఫీ.....మధ్యాహ్న భోజనం: ఆపిల్ హల్వా, పూర్ణం, మద్రాసు పకోడి, కొబ్బరి అన్నం, కడాయ్ వెజిటబుల్ కూర్మా, రైతా, మామిడి ఆకురాల పప్పు, దొండకాయ్ కార్న్ కోటెడ్ ఫ్రై, ములక్కాడ టమోట కర్రీ, గుత్తి వంకాయ కూర, బీరకాయ - పచ్చి బటాని, పచ్చి టమోట, కొత్తిమీర రోటీ చట్నీ, మామిడి పచ్చడి, డైమండ్ చిప్స్, సాంబార్, మజ్జిగచారు, వైట్ రైస్, పెరుగు, ఐస్‌క్రీమ్....సాయంత్రం: స్నాక్స్‌గా తాపేశ్వరం కాజ, ఆకు పకోడి....రాత్రి భోజనం: సేమ్యా కేసరి, మిర్చి బజ్జి, టమాట పప్పు, బంగాళదుంప ఫ్రై, దోసకాయ కూర, గోంగూర చట్నీ, సాంబార్, చిప్స్, వైట్ రైస్, పెరుగు.

రెండో రోజు...అంటే 28వ తేదీన
మే 28 ఎన్‌టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయనకు ఇష్టమైన ప్రత్యేక మెనూ వడ్డించారు....అల్పాహారం: స్వీట్ సేమ్యారవ్వ కేసరి, ఇడ్లీ, పునుగు, గారి, కట్టిపొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ, టీ, కాఫీ....మధ్నాహ్నం భోజనం: చక్కెర పొంగలి, బాదం కత్రి, మసాల వడ, చింతపండు పులిహోర, వెజ్ బిర్యానీ, వెజ్ జైపూర్ కూర్మా, రైతా, ముద్దపప్పు, దప్పళం, బెండకాయ కొబ్బరి ఫ్రై, వంకాయ బటాణీ ఫ్రై, కొత్త మామిడి పచ్చడి, గోంగూర చట్నీ, ఉలవచారు క్రీమ్, సాంబారు, ప్లవర్ పాపడ్, వైట్ రైస్, హెరిటేజ్ పెరుగు, హెరిటేజ్ ఐస్‌క్రీమ్....సాయంత్రం: స్నాక్స్‌గా పూతరేకులు, కాజు, వేరుసెనగ పకోడి...రాత్రి భోజనం: బెల్లం జిలేబీ, వెజ్ కట్లెట్, పప్పు ఆకు కూర, వంకాయ పకోడి, సింగిల్ బీన్స్ గ్రేవీ కర్రీ, మిక్స్‌డ్ వెజిటబుల్ చట్నీ, సాంబార్, చిప్స్, వైట్ రైస్, పెరుగును అందిస్తారు.

చివరి రోజు...అంటే 29వ తేదీ
అల్పాహారం: ఇడ్లీ, పునుగు, రవ్వ ఉప్మా, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ , టీ, కాఫీ...మధ్నాహ్న భోజనం: బ్రెడ్ హల్వా, గులాబ్‌జామ్, కార్న్‌రోల్, టమాటో రైస్, మిక్స్‌డ్ వెజిటబుల్ కూర్మా, రైతా, టమాటా పప్పు, క్యాబేజీ - క్యారట్ - కోకోనట్ ఫ్రై, సొరకాయ మసాలా కర్రీ, బెండకాయ పులుసు, మిక్స్‌డ్ వెజిటబుల్స్ రోటి పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఫ్లవర్ పాపడ్, సాంబార్, పచ్చి పులుసు, అన్నం, హెరిటేజ్ పెరుగు, హెరిటేజ్ ఐస్‌క్రీమ్...సాయంత్రం: స్నాక్స్‌గా బందరు లడ్డు, మురుకులు.
....రాత్రి భోజనం: ఫ్రూట్ కేసరి, అరటికాయ బజ్జీ , సొరకాయపప్పు, దొండకాయ కొబ్బరి ఫ్రై, మామిడి - దోసకాయ - మిల్‌మేకర్ చట్నీ, సొరకాయ చట్నీ, సాంబార్, చిప్స్ వైట్ రైస్, పెరుగు...ఇవండీ మహానాడు...ఇవండీ..మహావిందుకు సంబంధించిన వివరాలు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!