టి: సీమాంధ్రలో పోలీసుల మోహరింపు, హైద్రాబాద్‌లోను
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యస్థీకరణ బిల్లు నేపథ్యంలో రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించాలని ఆదేశించారు. సీమాంధ్రలో ఎలాంటి అవాంఛనీయసంఘటనలు జరగకుండా చూడాలని డిజిపి ప్రసాద రావు సీమాంధ్ర జిల్లాల్లోని పోలీసు అధికారులను ఆదేశించారు. సీమాంధ్రలో మరింత భద్రత పెంచాలని డిజిపి సూచించారు.
అనంతపురం, కర్నూలు, కడప, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలతో పాటు హైదరాబాదు, సైబరాబాదు పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. సీమాంధ్ర నేతల ఇల్లు, ఆయా పార్టీల కార్యాలయాలకు భద్రతను పెంచారు.

రాష్ట్ర విభజన తుది అంకానికి చేరుకోవడంతో కేంద్ర హోం శాఖ అలర్టయింది. విభజన జరిగితే సీమాంధ్ర జిల్లాల్లో భారీ ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉండటంతో, భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిజిపి భద్రతకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అదనపు బలగాలను పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.
పార్లమెంటు గేట్ వద్ద ఉద్రిక్తత
పార్లమెంటు గేట్ 1 వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్లమెంటులోకి వెళ్లేందుకు యత్నించారు. భద్రతా సిబ్బంది మోదుగులను అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందితో మోదుగుల వాగ్వాదానికి దిగారు. ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా పార్లమెంటు ప్రధానగేటును మూసేశారు.












Click it and Unblock the Notifications