షాక్: శివాజీకి జనసేన మద్దతు, మండిపడ్డ బీజేపీ
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదాను వెంటనే ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రముఖ నటుడు శివాజీ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో ఆదివారం ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు పలువురు మద్దతు తెలిపారు. శివాజీకీ జనసేన పార్టీకి చెందిన విజయవాడ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు.
ఏపీని రాజధాని లేకుండా తలలేని మొండెంలా చేశారని శివాజీ మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాల నుండి ఒత్తిడి వస్తుందంటూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు మాట్లాడిన నేతలే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సూచించారు. ఆయన పోరాడితే కేంద్రం తప్పకుండ్ దిగొస్తుందన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని శివాజీ సోమవారం ఉదయం చెప్పారు. కాగా, పోలీసులు శివాజీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా, శివాజీ పైన కామినేని శ్రీనివాస్ రావు ధ్వజమెత్తారు. శివాజీ ఏ పార్టీలో ఉన్నారో తల్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అంశంపై బీజేపీకి స్పష్టమైన వైఖరి ఉందన్నారు. ఆయన విశాఖలో మాట్లాడారు. శివాజీ పాపులారిటీ కోసమే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, పురంధేశ్వరి మాట్లాడుతూ.. శివాజీకీ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వమే లేదని, తాము ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

శివాజీ
అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన తర్వాత అనాథలా మారిన ఆంధ్రప్రదేశ్‌లో భావి తరాల కోసం ప్రత్యేక హోదాకు తాను ఆందోళన బాట పట్టినట్లు సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించేవరకు వివిధ రూపాల్లో తన పోరాటం కొనసాగుతుందన్నారు. తాను చట్ట పరిధికి లోబడి గాంధేయ మార్గంలో ఆందోళనకు శ్రీకారం చుట్టానన్నారు.

శివాజీ
రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నాయకులంతా ఏకతాటిపై నిలచి ప్రస్తుత సమావేశాల్లోనే ప్రత్యేక హోదా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో నివసించే ప్రతి ఒక్కరి భవిష్యత్తు ప్రత్యేక హోదాతో ముడిపడి ఉందన్నారు.

శివాజీ
ఎవరు కలసి వచ్చినా, రాకపోయినా లక్ష్య సాధన కోసం తుది శ్వాస విడిచేవరకు పోరాడతానని స్పష్టం చేశారు. తన ఆందోళన ఏ ఒక్కరికోసమో కాదని, యావత్ తెలుగుజాతి ప్రజల కోసమన్నారు. అధికారంలోకి రాకముందు ఒక విధంగా, వచ్చిన తర్వాత మరో విధంగా నాయకులు వ్యవహరిస్తే ఆంధ్ర ప్రజలు అవివేకులు కారని, తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు.

శివాజీ
కేంద్రం మంచి మనసుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తర్వాత తాను ఎటువంటి రాజకీయ పదవులు కోరబోనని, ఒక సామాజిక కార్యకర్తగా పని చేస్తానన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కన్నా ఎవరూ గొప్ప కాదని, తాను ఎవరినీ ఇబ్బంది పెట్టనని, అదే సమయంలో ఎవరికీ భయపడనని చెప్పారు. తనకు రాజకీయాలు తెలియవని, ప్రజల పక్షాన పోరాడటమే తన ఎజెండా అన్నారు.












Click it and Unblock the Notifications