ప్రత్యేక హోదా: పవన్ కళ్యాణ్ నుంచి అందరిదీ... కేసీఆర్ ప్రస్తావనే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై భారతీయ జనతా పార్టీని, మిత్రపక్షం తెలుగుదేశం పార్టీని విపక్షాలు, జేఏసీలు తప్పుబడుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని నిప్పులు చెరుగుతున్నారు.
ఈ సందర్భంగా పలువురు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేర్లను ప్రస్తావిస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి నటుడు శివాజీ వరకు ఇలా పలువురు కేసీఆర్, తెలంగాణ ఉద్యమాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
తాము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పింది. టిడిపి కూడా ఆ పార్టీ మిత్రపక్షం. 2014 ఎన్నికల్లో టిడిపి - బిజెపి కలిసి పోటీ చేస్తే, పవన్ కళ్యాణ్ మద్దతివ్వడమే కాకుండా, జోరుగా ప్రచారం నిర్వహించారు.

ఇప్పుడు కేంద్రమంత్రులు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో, తెలంగాణ ఉద్యమాన్ని, కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని పోరాడలని సూచిస్తున్నారు.
ప్రత్యేక హోదా విషయమై గతంలో ఓసారి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి ప్రత్యేక హోదా ఉద్యమంలో కనిపించాలని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల క్రితం నటుడు శివాజీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పేరు ఏపీలో ప్రస్తావనకు రావడం గమనార్హం.












Click it and Unblock the Notifications