అన్నా... గెలిపిస్తావుగా: సీఎం జగన్
ఏపీలో మహా సంగ్రామం జరగబోతోంది. అందుకు సమయం కూడా చాలా తక్కువే ఉంది. ఎన్నికల సంఘం నుంచి ప్రకటన రావడమే తరువాయి.. అన్ని పార్టీలు బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ అన్ని అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అధికారంలో ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో కలిసి రావడానికి ఉవ్విళ్లూరుతోంది.
రాష్ట్రంలో శ్రీకాకుళం కీలకమైన నియోజకవర్గం. ఇక్కడి నుంచి మహామహులైన నేతలంతా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై 5,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన ధర్మానపై గుండా లక్ష్మీదేవి 24,131 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ప్రస్తుతం వైసీపీని ఓడించడానికి జనసేన, బీజేపీతో కలిసిరావడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. రేపో, ఎల్లుండో బీజేపీ నిర్ణయం వెలువడనుంది. అనంతరం సీట్ల ఖరారు ప్రారంభమవుతుంది.

నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో కృషికార్ లోక్ పార్టీ తరఫున కిల్లి అప్పలనాయుడు ఘనవిజయం సాధించారు. తర్వాత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు విజయం సాధించాయి. స్వతంత్రులు రెండుసార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి, జనతాపార్టీ ఒకసారి గెలుపొందాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని కచ్చితంగా ఓడిస్తామనే ధీమాలో తెలుగుదేశం పార్టీ ఉండగా, మరోసారి గెలుపు ఖాయమని వైసీపీ విశ్వాసంతో ఉంది. మాజీ మంత్రి ధర్మానకున్న రాజకీయ అనుభవం కలిసివస్తుందనే నమ్మకంలో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు.












Click it and Unblock the Notifications