బాబు అడ్డుకుంటున్నారు: శ్రీకాంత్, రాజధానిపై బాబు
కడప/ హైదరాబాద్: కడప జిల్లాకు రావాల్సిన పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు కక్ష సాధింపు తగదని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. జిల్లాలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆయన అన్నారు.
విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ఎందుకు ఆపారో తక్షణమే చెప్పాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. వచ్చిన పరిశ్రమలను వెనక్కి పంపుతూ జిల్లా ప్రజలపై కక్ష సాధించడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది. ఈ నెల 17, 18 తేదీల్లో ఉపసంఘం పర్యటిస్తుందని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. తొలి దశలో 30 వేల ఎకరాలను సమీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
మంత్రి వర్గ ఉపసంఘంతో చంద్రబాబు శనివారంనాడు సమావేశమయ్యారు. కమిటీ ఇప్పటి వరకు సేకరించిన వివరాలు, భూముల లభ్యత, వాటి ధరలు, రైతుల డిమాండ్స్ తదితర విషయాలను ముఖ్యమంత్రికి వివరించింది. విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందని చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.
రాష్ట్ర రాజధానిని గుంటూరులో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. మంగళగిరి, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటవుతుందని భావిస్తూ వస్తున్నారు. రాజధానిపై చంద్రబాబు చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. భూముల లభ్యతే సమస్యగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications