‘పవన్‌ది మంచి నిర్ణయం, బాలయ్య దుర్మార్గం! కృత్రిమ నేత లోకేష్ జాడేది?’
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నంద్యాల ఉపఎన్నికల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
కర్నూలు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నంద్యాల ఉపఎన్నికల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మూడున్నరేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి, దోపిడీ గురించి పవన్‌కు తెలిసివుంటుందని అన్నారు.

పవన్ అభిమానులూ తెలుసుకోవాలి..
గురువారం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, పవన్ అభిమానులు కూడా సీఎం చంద్రబాబు అవినీతి గురించి తెలుసుకోవాలని సూచించారు. నంద్యాలలో జగన్ సభలకు స్వచ్ఛందంగా తరలివస్తున్న జనాలను చూసి అధికార పార్టీ నేతలు బెంబేలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. తమ సభలకు జనం రాకుండా చేయాలనే కుట్రతో డబ్బులిచ్చి ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు.

బాలయ్య దుర్మార్గం..
ఎమ్మెల్యే బాలకృష్ణ విజ్ఞత కోల్పోతున్నారని, కార్యకర్తపై చేయిచేసుకోవడం దారుణమని అన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉండి డబ్బులు పంచడం దుర్మార్గమని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

కృత్రిమ నేత ఎక్కడ.?
కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. కృత్రి నేత, ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

అఖిలప్రియా! తెలుసుకో..
భూమా కుటుంబాన్ని వైయస్ జగన్ అన్ని విధాలుగా ఆదరిస్తే చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. అఖిలప్రియకు చెప్పకుండానే గంగుల ప్రతాప్ రెడ్డిని టీడీపీలో చేర్చుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అఖిలప్రియ ఇప్పటికైనా వాస్తవం తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు మైనార్టీలకు చేసిందేమీ లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు కాకినాడలో బీజేపీతో పొత్తు కావాలట, నంద్యాలలో మాత్రం బీజేపీ జెండాలతో తిరగొద్దట.. అంటూ శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఎన్నికలు రద్దు చేయాలి
నంద్యాల ఉపఎన్నికలను రద్దు చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నారని ఆయన ఆరోపించారు. ఈసీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. సొంత లాభాల కోసమే చంద్రబాబు, జగన్‌లు ప్రధానిని కలుస్తున్నారని రఘువీరా ఆరోపించారు.












Click it and Unblock the Notifications