సీట్లపై తకరారు: బిజెపి, టిడిపి మధ్య తెగని చర్చలు

బిజెపికి తెలంగాణలో 8, సీమాంధ్రలో 5 ఎంపీ సీట్లు కేటాయించడమే చాలా ఎక్కువని తెలుగుదేశం నేతలు కూడా చంద్రబాబు వద్ద వాదిస్తున్నట్లు సమాచారం. అంతేకాక తాము అడిగిన సీట్లనే కేటాయించి, అందులో తాము ఎవర్ని నిలబెట్టినా ప్రశ్నించకూడదన్నట్లు బిజెపి వ్యవహరించడం తెలుగుదేశం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదని అంటున్నారు.
చర్చలు జరుగుతున్న తీరును సమీక్షించిన చంద్రబాబు నాయుడు బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం. తమ పార్టీలో అంతర్గతంగా ఎన్ని సమస్యలున్నా తాము సర్దుకు పోయే ప్రయత్నం చేస్తున్నామని, కానీ బిజెపి మరీ అతిగా ఒత్తిడి తెస్తే కలిసి వెళ్లడం సాధ్యపడదని, ఇద్దరం కలిసి ఎక్కువ సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేయాలని, అంతేగానీ, సీట్లు పోగొట్టుకోవడం కాదని ఆయన అన్నట్లు సమాచారం. ఈ స్థితిలో ఢిల్లీ రావల్సిందిగా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని రాజ్‌నాథ్ ఆదేశించడంతో ఆయన కూడా ఢిల్లీ చేరుకున్నారు. హైదరాబాద్‌కు వెళ్లి పరిస్థితి చక్కదిద్దాలని ప్రకాశ్ జవదేకర్‌ను బీజేపీ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలిసింది.
తెలంగాణలో బిజెపికి 46 అసెంబ్లీ, 8 లోక్‌సభ సీట్లు ఇచ్చేందుకు మంగళవారమే అంగీకారం కుదిరిందని, సీమాంధ్ర సీట్ల విషయంపై మాత్రం ఇంకా ప్రతిష్టంభన నెలకొన్నదని బిజెపి నేతలు చెబుతున్నారు. సీమాంధ్రలో చివరకు 20 అసెంబ్లీ సీట్లు, 6 లోక్‌సభ సీట్లలో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే 15 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఇస్తానని టిడిపి అంటోందని, ఇది తమకు అంగీకారం కాదని బిజెపి నాయకులు అంటున్నారు.
విశాఖపట్నం, కాకినాడ, ఒంగోలు, తిరుపతి, రాజంపేట, హిందూపురం లోకసభ స్థానాలను, పలాస, శ్రీకాకుళం, గజపతి నగరం, విశాఖ ఉత్తరం, కాకినాడ, రాజమండ్రి రూరల్, రాజోలు, భీమవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ తూర్పు, అవనిగడ్డ, నర్సరావుపేట, కొండెపి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్, తంబళ్ళపల్లి, మదనపల్లి, అనంతపురం అర్బన్, శింగనమల, కడప, పాణ్యం తదితర శాసనసభా స్థానాలను బిజెపి అడుగుతున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వివిధ జిల్లాల సీట్లపై ఒక అవగాహన వచ్చినా హైదరాబాద్‌ను ఆనుకొని రంగారెడ్డి జిల్లాలో ఉన్న సీట్ల విషయంలో తర్జనభర్జన నడుస్తోంది. 55 సీట్ల జాబితా ఇచ్చిన బిజెపి అందులో 45 కావాలని కోరింది. ఆ జాబితాలో ఇరవై సీట్లు తమకు కావాల్సినవి ఎంచుకొంటే మరో ఇరవై తాము ఇస్తామని తెలుగుదేశం సూచించింది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద, బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు చర్చలు కొలిక్కి రావడం లేదు.












Click it and Unblock the Notifications