పవన్‌కళ్యాణ్ సభలో తొక్కిసలాట, నాలో కసిఉంది: బాబు
విజయనగరం/రాజమండ్రి: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి ప్రచారం చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజయనగరం సభలో తొక్కిసలాట జరిగింది. పవన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు మహిళలు స్పహ తప్పారు. వారిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
టిడిపి అభ్యర్థిపై జగన్ పార్టీ దాడి
కర్నూలు జిల్లా మంత్రాలయం టిడిపి అభ్యర్థి తిక్కారెడ్డి పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. నియోజకవర్గంలోని రాంపురంలో ప్రచారం కోసం వచ్చిన తిక్కారెడ్డి పైన వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తిక్కారెడ్డి కారు అద్దాలు పగిలాయి. ఆయన పోలీసు స్టేషన్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన ఫిర్యాదు చేశారు.

పాస్టర్లకు జగన్ పార్టీ డబ్బు పంపిణీ
కృష్ణా జిల్లా కైకలూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రలోభాలకు తెర తీసింది. కైకలూరులోని మన్నా చర్చిలో సమావేశాలు పెట్టి ఒక్కో సీల్డు కవర్‌లో 500 రూపాయలు పెట్టి పాస్టర్లకు అందజేశారు. డబ్బులు పంపిణీ చేస్తుండగా, ఎన్నికల తనిఖీ ప్రత్యేక బృందం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
పరిటాల శ్రీరామ్‌కు బెయిల్ మంజూరు
టిడిపి నేత పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు అనంతపురం జిల్లా ధర్మవరం కోర్టు శనివారం బెయిల్ ఇచ్చింది. నాలుగైదు రోజుల క్రితం ఘర్షణ కేసులో శుక్రవారం కనగానపల్లెలో శ్రీరామ్ పోలీసులకు స్వయంగా లొంగిపోవడంతో కోర్టు ఈ నెల 16 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
కసి ఉంది: చంద్రబాబు
పిల్లల భవిష్యత్తు కోసం తాను హైదరాబాదును అభివృద్ధి చేశానని, అయితే అరవై శాతం ప్రజలను కట్టుబట్టలతో పంపించారని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన సామర్ల కోటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేయాలనే కసితో ఉన్నానని చెప్పారు. రైతులకు రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే సీమాంధ్రలో రెండు ఉపముఖ్యమంత్రి పదవులు ఇస్తానని చెప్పారు. బిసిలకు, కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నారు.
తనను, మోడీని, పవన్‌ను తిట్టే వైయస్ జగన్.. తెరాస అధ్యక్షులు కెసిఆర్ పైన మాత్రం నోరు మెదపరన్నారు. వారి మధ్య ఉన్న ఫిక్సింగ్ ప్రజలు గుర్తించాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే బెల్టు షాపుల పైన తొలి సంతకం పెడతానన్నారు. కెసిఆర్‌కు తాను గట్టి హెచ్చరికలు పంపానని, జగన్‌కు మాత్రం అలాంటి ధైర్యం లేదా అని ప్రశ్నించారు. కాపులను వెనుకబడిన వర్గాల్లో చేర్చుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications