విజయవాడ ఎంపీగా పోటీ ! టీడీపీ-జనసేనతో పొత్తుపై త్వరలో నిర్ణయం-సుజనా కామెంట్స్..
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, ఎన్నికల నాటికి బీజేపీ కూడా కూటమిలోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఆ పార్టీ నేత సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ స్ధానంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీకి సుజనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేయనున్నట్లు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి వెల్లడించారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఇక్కడి నుంచి పోటికి దిగనున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై త్వరలో క్లారిటీ రానుందన్నారు. అలాగే రాష్ట్రంలో పొత్తులకు సంబంధించి కూడా బీజేపీ అధిష్టానం అతి త్వరలో నిర్ణయం తీసుకుంటుందని సుజనా తెలిపారు. విజయవాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తే బీజేపీ గెలుపు ఖాయమన్నారు.

అమరావతి రాజధానిపై జరుగుతున్న చర్చపై స్పందిస్తూ ఇందులో ఎలాంటి మార్పూ లేదన్నారు. తమ పార్టీ అధిష్టానం కూడా అమరావతికి అనుకూలమేనని సుజనా తెలిపారు. మరోవైపు ఏపీలో రాజ్యసభ ఎన్నికలపై మాత్రం బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మాత్రం స్వేచ్ఛాయుతంగా జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే ఈసీ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం హర్షణీయమన్నారు.












Click it and Unblock the Notifications