Sujana Chowdary: కేశినేని నానికి సుజనా ఘాటు కౌంటర్-నేను లోకల్.. !
ఏపీలో ఎన్నికల వేళ విజయవాడలో రాజకీయం మరింత వాడీవేడిగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీలో ఎంపీగా ఉన్న కేశినేని నాని కాస్తా వైసీపీలోకి ఫిరాయించి మరోసారి ఎంపీగా పోటీకి టికెట్ తెచ్చుకున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఈసారి ఎంపీగా బరిలోకి దిగుతారని భావించిన బీజేపీ నేత సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. దీంతో ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేసిన వీరిద్దరి మధ్య ఇప్పుడు వార్ మొదలైంది.
విజయవాడ ప్రజలు స్ధానికులకే ఓటేస్తారని ఓసారి, బీసీలకే ఓటేస్తారని మరోసారి, హెలికాఫ్టర్లలో దిగే వారిని ఆదరించరని ఇంకోసారి కేశినేని నాని తనను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నేత, పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే ఉమ్మడి అభ్యర్ధి అయిన సుజనా చౌదరి ఘాటుగా స్పందించారు. వైసీపీలోకి వెళ్లకముందు పదేళ్లు నానితో కలిసి పనిచేశానని, కానీ అప్పుడు బాగానే ఉండేవారని, ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాక తన స్ధాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని సుజనా కౌంటర్ ఇచ్చారు.

అలాగే కేశినేని నాని స్థాయికి తాను దిగిజారి మాట్లాడలేనని సుజనా చౌదరి తేల్చిచెప్పేశారు. ఆయన ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారో ఆయన్నే అడగాలన్నారు. కేశినేని ధనిక అభ్యర్ధి వ్యాఖ్యలపైనా సుజనా కౌంటర్ ఇచ్చారు. తాను ధనికుడిగానే పుట్టానని, తాను ధనికుడినినని ఇప్పుడే నానికీ తెలిసిందా అని ప్రశ్నించారు. ధనికులు అయితే ప్రజలకు సేవ చేయరా, ప్రజల్లో కలవరా అని అడిగారు. ఆయన మాట్లాడినట్లు తనకు నీచంగా మాట్లాడటం రాదన్నారు.
అలాగే స్ధానికులకే జనం ఓటేస్తారంటూ కేశినేని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాను విజయవాడ వాసినే అన్నారు. తాను స్థానికేతురుడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విజయవాడలో ఉన్న వారంతా ఇక్కడి వారేనా అని ప్రశ్నించారు. కొంతమంది నేతలు చాలా దిగజారి మాట్లాడుతున్నారని, వారిపై సానుభూతి వ్యక్తం చేయడం తప్ప తానేమీ చేయలేనన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి రోడ్డూ తనకు తెలుసని కేశినేనికి సుజనా గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications