సుజానాకు షాక్: ‘సత్యం’కు 6.2కోట్లను వడ్డీతో చెల్లించమన్న కోర్టు
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ బి రామలింగరాజుకు రూ. 6.2 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కేంద్ర సహాయ మంత్రి వైయస్ సుజనా చౌదరి, ఆయన కంపెనీల(సుజనా గ్రూప్ ఇండస్ట్రీస్)ను ఆదేశించింది. గతంలో రుణ రూపంలో రామలింగరాజు కంపెనీల నుంచి సుజనా చౌదరి కంపెనీలు తీసుకున్న రుణంపై, ఒప్పంద పత్రాల్లో రాసుకున్నట్టుగా 18 నుంచి 24 శాతం వడ్డీనీ చెల్లించాలని ఆదేశించింది.
కాగా, వడ్డీ కూడా కలుపుకుంటే సుజనా చౌదరి మొత్తం రూ. 17 కోట్ల వరకూ చెల్లించాల్సి వుంటుందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. రామలింగరాజు స్థాపించిన కంపెనీలు, ఫిన్ సిటీ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైగ్రేస్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలెం ఇన్వెస్ట్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుంచి ఐదు దఫాలుగా సుజనా చౌదరికి చెందిన కంపెనీలు రుణాలను తీసుకున్నాయి.

ఈ రుణాలను సుజనా కాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, ఫ్యూచర్ టెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్లాటినా ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు తీసుకోగా, రుణాలన్నింటికీ సుజనా గ్యారంటర్‌గా సంతకాలు పెట్టారు. ఆయనతో పాటు సుజనా సన్నిహితుడు, కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్న ఆర్ దేవేందర్ రెడ్డి సైతం గ్యారంటీ సంతకాలు చేశారు.
1999లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం కాగా, రామలింగరాజు సంస్థలు 2003లో కోర్టును ఆశ్రయించాయి. వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని శనివారం తీర్పిచ్చింది.












Click it and Unblock the Notifications