సుజయ టిడిపిలో చేరడం వెనుక...: జగన్ వద్ద బొత్స చక్రం!
విజయనగరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ఊహాగానాలు రావడం ఇది తొలిసారి కాదు. చాలారోజులుగా ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అందుకు కారణం.. అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచే సుజయ పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత చల్లబడింది. అయితే, జిల్లాలో, రాష్ట్రస్థాయిలో బొత్స చక్రం తిప్పుతుండటంతో పార్టీలో సుజయ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

దాదాపు ఏడాది క్రితం బొత్స అధికారికంగా వైసిపిలో చేరారు. బొత్స వైసిపిలో చేరినప్పటి నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు కొంత అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అంతకుముందు నుంచి సుజయ, బొత్సల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
నాడు బొత్స పార్టీలో చేరుతున్న సమయంలో సుజయ లోటస్ పాండుకు రాలేదు. బలమైన సామాజిక వర్గం కలిగిన సుజయ్ పార్టీ వీడితే నష్టమేనని అంటున్నారు. సుజయ తన కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు.
బొత్స పార్టీలో చేరిన సమయంలోనే సుజయ అలక వహించడం, పార్టీ అధినేత జగన్ బుజ్జగించడం జరిగిపోయాయి. అయితే, ఇప్పుడు మాత్రం సుజయ పైన తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఫలించింది. ఈ నెల 15వ తేదీన లేదా 17వ తేదీన ఆయన పార్టీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. సుజయతో పాటు యావత్ బొబ్బిలి వైసిపి కేడర్ తెలుగుదేశం పార్టీలోకి రానుంది.












Click it and Unblock the Notifications