ఏపీ, తెలంగాణాలో పెరిగిన ఎండతీవ్రత; మార్చిలో మరింత మంట.. తస్మాత్ జాగ్రత్త!!
తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఊహించని విధంగా ఫిబ్రవరి నెల నుంచే పెరుగుతున్న ఎండలు, ఇప్పుడు మార్చి నెలలో మరింత తీవ్ర రూపం దాలుస్తాయి అని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడే ఎండలు మండి పోతుండడంతో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు సగటు కన్నా ఎక్కువగా నమోదు కావచ్చని ఐఎండి అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం చాలా వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. సగటు ఉష్ణోగ్రతలు 24°C మరియు 37°C మధ్య ఉంటాయని చెబుతున్నారు. వేసవి తాపం నుంచి కాపాడుకోవడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా నీరు త్రాగడం మంచిదని సూచిస్తున్నారు .

ఇక మార్చి నెల చివరిలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 32 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఈ నెలలో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
రాత్రి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 20 డిగ్రీలు గా నమోదు అవుతుండగా, ఈ నెలలో మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ నెలలో రాత్రి ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలు సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎండ దెబ్బకు విలవిలలాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఎండలు ముదురుతున్నాయి.
ఏప్రిల్ నెలకు ముందే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో ఈసారి ఎండాకాలం ఎలా ఉంటుందో అన్న ఆందోళన అందరిలో వ్యక్తమవుతుంది. ఉదయం 10 గంటలకే ప్రచండ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఏది ఏమైనా గతం కంటే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications