సహించేది లేదు: అధికారులను హెచ్చరించిన చంద్రబాబు
హైదరాబాద్: అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. పనిచేయని అధికారులను సహించేది లేదని ఆయన హెచ్చరించారు. శనివారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని బొండాపల్లి గ్రామంలో 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్బంగా తమ గ్రామంలో భూముల రికార్డులు అస్తవ్యస్ధంగా ఉన్నాయంటూ గ్రామస్తులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు.
ప్రజలకు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం శనివారం జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు సుదీర్ఘ సెలవులు పెడితే శాశ్వతంగా ఇంటికి పంపిస్తానని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఆస్పత్రుల్లో హాజరు కోసం వేలిముద్రల వ్యవస్థ తీసుకొస్తామన్నారు. ఇబ్బందుల నుంచి రాష్ట్రం పూర్తిగా బయటపడలేదన్నారు. పిల్లలను బాగా చదివించుకోవాలని, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా ప్రయోజనాలు అందజేస్తామని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications