వివేకా కేసులో సుప్రీం కీలక నిర్ణయం..! మళ్లీ మొదటికి- ఆ నిందితులకు ఊరట..!
ఏపీలో ఆరేళ్లుగా సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తున్న సుప్రీంకోర్టు.. ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగింపు విషయంలో పిటిషనర్ సునీతకు ఓ సూచన చేసింది.
వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సీబీఐ అభిప్రాయం కోరింది. దీంతో వివేకా కేసులో దర్యాప్తు ముగిసినట్లు సీబీఐ తేల్చేసింది. అయితే దీనిపై పిటిషనర్ సునీత అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కోరితే దర్యాప్తును మరింత లోతుగా చేసేందుకు సిద్దమని సీబీఐ తెలిపింది.

దీనిపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. సీబీఐ దర్యాప్తు కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. చివరికి పిటిషనర్ సునీతను ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగింపు కోసం ట్రయల్ కోర్టు (హైదరాబాద్ సీబీఐ కోర్టు) ను ఆశ్రయించాలని సూచించింది. అలాగే సీబీఐ కోర్టు కూడా మెరిట్ ఆధారంగా 8 వారాల్లోకా సీబీఐ దర్యాప్తు కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో ఈ కేసు వ్యవహారం తిరిగి మొదటికి వచ్చినట్లయింది.

మరోవైపు వివేకా హత్య కేసులో గతంలో తెలంగాణ హైకోర్టు నుంచి బెయిల్ పొందిన నిందితులకు కూడా తాత్కాలిక ఊరట లభించింది. హైదరాబాద్ సీబీఐ కోర్టు వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే వరకూ నిందితులకు ఇచ్చిన బెయిళ్ల రద్దు కోసం దాఖలైన పిటిషన్లపై విచారణల్ని వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో ఆయా నిందితుల బెయిల్స్ రద్దు వ్యవహారం కూడా వాయిదా పడినట్లయింది.












Click it and Unblock the Notifications