ఏపీ,తెలంగాణ విభజన చట్టంపై సుప్రీం మరో క్లారిటీ- తెలంగాణ ఈ-పాస్ చట్టబద్దమే...
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఎంపిక చేశారు. దాని గడువు 2024 వరకూ ఉంది. కానీ తాజాగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చే వారికి ఈ-పాస్ నిబంధన పెట్టింది. ఏపీ నుంచి తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో అత్యవసర పరిస్ధితుల్లో ఉన్న వారికి మాత్రమే ఈ-పాస్ ద్వారా అనుమతిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఏపీ నుంచి వచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం ఈ-పాస్ నిబంధన పెట్టడంపై కృష్ణాజిల్లాకు చెందిన ఓ లా విద్యార్ధి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇరు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కు వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ-పాస్ నిబంధన ఎలా పెడుతుందని పిటిషనర్ ప్రశ్నించారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం దీనిపై భిన్నంగా స్పందించింది. 2014 నాటి ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయాలు కలిగించకూడదన్న నిబంధనపై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఈ-పాస్ కు అడ్డంకి కాబోదని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే విపత్తు నిర్వహణ చట్టం కింద జారీ చేసిన ఈ-పాస్ కు సెక్షన్ 5 వర్తించదని తెలిపింది. కరోనా సమయంలో జారీ చేసిన ఈ-పాస్ నోటిఫికేషన్ కు ఇప్పుడు కాలం చెల్లిందని కూడా సుప్రీంకోర్టు తెలిపింది ఆ నోటీఫికేషన్ గడువు పూర్తయింది కాబట్టి దీనిపై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తద్వారా కరోనా వంటి అత్యవసర సమయాల్లో ఈ-పాస్ జారీ చేయడం తప్పు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications