Raghurama: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న రఘురామ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా గెలిచి ఆ తర్వాత జగన్ పై తిరుగుబాటు చేస్తున్న క్రమంలో రాజద్రోహం కేసు ఎదుర్కొన్న రఘురామకృష్ణంరాజును సీఐడీ కస్టడీలో పోలీసులు హింసించారు. ఈ వ్యవహారంపై అప్పట్లోనే సుప్రీంకోర్టు కూడా స్పందించి ఆయన్ను సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి పంపి టెస్టులు చేయించి ఈ ఘటనను నిర్ధారించింది. ఆ తర్వాత బెయిల్ తెచ్చుకున్న రఘురామ ఎన్నికల నాటికి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యారు.
అయితే వైసీపీ హయాంలో రఘురామరాజుపై సీఐడీ కస్టడీలో జరిగిన దాడిపై కూటమి సర్కార్ లో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకూ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి, తాజాగా సస్పెండ్ కూడా అయిన పీవీ సునీల్ కుమార్ ను విచారణకు పిలిపించకపోవడంపై రఘురామ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. దీనిపై పలుమార్లు టీడీపీ పెద్దల్ని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో మిన్నకుండిపోయారు.

అయితే తాజాగా ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ ను రఘురామరాజుపై దాడి కేసులో విచారణకు పిలుస్తూ పోలీసులు నోటీసులు పంపారు. కానీ ఆయన కుటుంబ కారణాలతో విచారణకు రాలేదు. ఎట్టకేలకు ఇవాళ ఆయన గుంటూరులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు నేతృత్వం వహిస్తున్న ఎస్పీ దామోదర్ ఆయన్ను విచారిస్తున్నారు. రఘురామపై దాడికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఆయనపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఇందులో ఇంకెవరు పాత్ర ఉందన్న అంశాలపై పోలీసులు పీవీ సునీల్ ను ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications